ఇందూరు, జూలై 22 : ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని నవదుర్గామాత ఆలయ ప్రాంగణంలో బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్ నేతృత్వంలో నిర్వహించిన ఉత్సవాల్లో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, మేయర్ దండు నీతూకిరణ్, కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.
మహిళా ఉద్యోగులతోపాటు వారి కుటుంబీకులు బోనాలతో కలెక్టరేట్లోని నవ దుర్గామాత ఆలయానికి చేరుకొని ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. బోనాల అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.