ఖలీల్‌వాడి/ నిజామాబాద్ రూరల్, జూలై 14 : వర్షాలకు నిరాశ్రయులైన ముంపు బాధితులకు అండగా ఉంటామని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఐదారు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నగర మేయర్ నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి తదితరులతో కలిసి బాబన్సాబ్పహాడ్, బోధన్ రోడ్డులోని ఫ్రూట్ మార్కెట్, బైపాస్ రోడ్డు, గంగస్థాన్ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించారు. ముంపు బాధితులకు వసతి కల్పించిన బోధన్ రోడ్డు లోని రేయాన్ ఫంక్షన్ హాల్, గూపన్‌పల్లిలోని ఇంపీరియల్ గార్డెన్లో కొనసాగుతున్న పునరావాస కేంద్రాలను సందర్శించారు.
బాధితులను పలుకరించి,వారికి అందిస్తున్న వసతి, సదుపాయాల గురించి మంత్రి వేముల అడిగి తెలుసుకున్నారు. భోజనం, బ్లాంకెట్స్ తదితరు సదుపాయాలు కల్పిస్తున్నారని ముంపు బాధితులు తెలుపగా, ఎలాంటి సమస్యలున్నా అధికారులను సంప్రదించాలని మంత్రి సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలని అధికారులను వేముల ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. భోజనం, వసతి సదుపాయాల కోసం నిధుల కొరత లేదని, పది వేల మందికైనా ప్రభుత్వపరంగా ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రతి వర్షాకాలంలో గూపన్పల్లి వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడల్లా తమను ఇక్కడికి అధికారులు తరలిస్తున్నారని బాధితులు మంత్రికి వివరించారు. తమకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని విన్నవించారు. గంగస్థాన్ వద్ద పూలాంగ్ వాగు, బాబన్సాబ్పహాడీ వద్ద ఉన్న కాలువల్లో నీటి ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి వేముల.. కెనాల్లకు ఆనుకుని నివాసాలు ఉంటున్న సుమారు వంద కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
బాబాన్సాబ్పహాడీకి వెళ్లే మార్గంలోని ఇరుకైన వంతెనతో రాకపోకలకు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఐదారు రోజుల నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని మంత్రి పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా చేపట్టిన ముందస్తు చర్యలతో చెదురుముదురు ఘటనలు మినహా, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదన్నారు. ఇకముందు కూడా భారీ వర్షాలు కురిస్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమై ఉందన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటికి రావొద్దని, ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించారు. భారీ వర్షాలతో జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నిలువరించేందుకు ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. అనేక చోట్ల రోడ్లపై నుంచి వరద ప్రవహిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ రాకపోకలు సాగించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పాత ఇండ్లల్లో నివసిస్తున్న వారు వెంటనే పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందాలని కలెక్టర్ సూచించారు. విద్యుత్ తీగలు, స్తంభాలకు దూరంగా ఉండాలన్నారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ చిత్రామిశ్రా, ఆర్డీవో రవి, తహసీల్దార్ సుదర్శన్, వివిధ శాఖల అధికారులు, డివిజన్ల కార్పొరేటర్లు ఉన్నారు.