నిజామాబాద్, జూలై 14, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారీ వర్షాలతో వచ్చిన వరద ముప్పు నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. సీఎం కేసీఆర్ స్వయంగా గంటల కొద్దీ సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ప్రజలకు అండగా నిలిచారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను హైదరాబాద్ వీడి నియోజకవర్గాలకు వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప్రజాప్రతినిధులు వరద ప్రాంతాల్లో తిరిగారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు స్పీకర్ పోచారం విస్తృతంగా పర్యటనలు నిర్వహించారు. వీరికి తోడుగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. రెండు జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు కునుకు లేకుండా శ్రమించారు. వారం రోజులపాటు ప్రజల ప్రాణాలను రక్షించేందుకు కృషి చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ క్లిష్ట పరిస్థితిని అధిగమించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కార మార్గాలను చూపించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చూపిన చొరవ, కృషిని ప్రజలంతా కొనియాడుతున్నారు.
ప్రజలతో బాజిరెడ్డి..
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సైతం సోమ, మంగళవారాల్లో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూనే ఎక్కడ అవసరం ఉన్నా సహాయక బృందాలను పంపించారు. క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్షలు నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. జక్రాన్‌పల్లిలో పలు చెరువులకు గండ్లు పడడం, మోపాల్ మండలంలో చెరువు కట్ట తెగిపోగా ప్రజలకు ధైర్యం చెప్పారు. నిజామాబాద్ రూరల్ మండలంలో ఇద్దరు వ్యక్తులు నిజాంసాగర్ కెనాల్లో కొట్టుకుపోయారు. గల్లంతైన వారి కోసం భారీ వర్షంలోనూ పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బందితో వెతికించారు. దురదృష్టవశాత్తు ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడగా సీఎం కేసీఆర్‌తో మాట్లాడి మృతుల కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయించేందుకు కృషి చేశారు. ఇండ్లు కూలి ఆవాసాలను కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయిస్తానని వారిలో ైస్థెర్యాన్ని నింపారు.
అప్రమత్తం చేసిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిస్థితిపై ఆది నుంచి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ చూపారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతూ సహాయక చర్యలపై దృష్టి పెట్టారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలకు సూచనలిస్తూ, కలెక్టర్లు, జిల్లా పోలీస్ అధికారులతో మాట్లాడుతూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట, ఆర్మూర్ మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో రెడ్ అలర్ట్ కొనసాగింది. నియోజకవర్గంలో కురుస్తున్న వానలు, వరద ప్రభావాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వీడియో కాన్ఫరెన్సుల ద్వారా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, ఎంపీపీలను అప్రమత్తం చేశారు. అవసరమైన చోట టీఆర్ఎస్ శ్రేణులను పంపించి సహకారాలు అందించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ నవీపేట, బోధన్, రెంజల్లో పర్యటించారు. నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు స్థానికంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశారు. జడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్లూర్ మండలంలో పర్యటించి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. తెగిన చెరువు కట్టలు, కోతకు గురైన రోడ్లను పరిశీలించి అధికారులను అప్రమత్తం చేశారు.
మేమున్నామంటూ..
కామారెడ్డి పట్టణంలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితి తెలుసుకుంటూ ఇంజినీర్లకు సలహాలు అందించారు. మంజీరలో ప్రవాహం భారీగా ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. కౌలాస్‌నాలా ప్రాజెక్టు నిండి గేట్లు ఎత్తగా దిగువన ఉన్న గ్రామాల్లోని జనాలకు హెచ్చరికలు జారీ చేయించారు. మహారాష్ట్రలోని లెండి నది ఉప్పొంగి రావడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు అటువైపు వెళ్లకుండా చొరవ తీసుకున్నారు. ఎమ్మెల్యే జాజాల సురేందర్ సైతం ప్రమాదకరంగా ఉన్న చెరువు కట్టలను పరిశీలించారు. వాటిని స్థానిక రైతులు, ఇరిగేషన్ సిబ్బందితో కలిసి కాపాడే ప్రయత్నం చేశారు.
కంటికి రెప్పలా స్పీకర్
భారీ వర్షాలు ప్రారంభం కాగానే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడకు వచ్చి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షలు నిర్వహించారు. భారీ వరద వస్తే ఎలా వ్యవహరించాలి, ప్రజలను పునరావాస కేంద్రాలకు ఎక్కడెక్కడికి తీసుకెళ్లాలి.. అనే ప్రణాళికలను రచించారు. వారం రోజులుగా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇబ్బందులు లేకుండా చూశారు. మంజీర ఉప్పొంగి ప్రవహించడంతో రైతులు పొలం బాటపట్టకుండా స్థానిక ప్రజా ప్రతినిధులతో హెచ్చరికలు జారీ చేయించారు. వరదలకు రోడ్లు చెడిపోయి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తిన విషయాన్ని ఆయా గ్రామాల్లో దండోరా వేయించి సమాచారం అందించారు. వారం రోజులుగా బాన్సువాడలో అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించారు. పలుచోట్ల గూడు చెదిరి ఇబ్బందులకు గురైన కుటుంబాలకు సాయం అందించారు.
అమెరికా నుంచి నేరుగా సమీక్షకు..
ఆటా సమావేశాలకు అమెరికా వెళ్లిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన పర్యటనను కుదించుకుని స్వదేశానికి వచ్చారు. వరద ప్రాంతాలపై సీఎం నిర్వహించిన సమీక్షకు హాజరయ్యారు. అనంతరం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి అప్రమత్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించి యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. గోదావరిలో వరద పోటెత్తడంతో కేసీఆర్ ఆదేశాలతో బుధవారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వెళ్లి పరిశీలించారు. బాల్కొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు కరంట్ నిలిచిపోగా పునరుద్ధరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం తెల్లవారుజాము వరకు అధికారులతో సమీక్ష నిర్వహించి రాత్రి నిజామాబాద్ నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలోనే బస చేశారు. ఉదయం తిరిగి కలెక్టర్ నారాయణరెడ్డి, జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఇతర అధికారులతో కలిసి నగరంలో ముంపు ప్రాంతాలను స్వయంగా పరిశీలించి పునరావాసం పొందుతున్న ప్రజలకు ధైర్యం చెప్పారు.