ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సీజన్ ప్రారంభమైన నెల రోజుల తర్వాత వరుణుడి జాడ కనిపించడంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సగటు వర్షపాతం కన్నా ఎక్కువగానే నమోదయ్యింది. దీంతో చెరువుల్లోకి వరద వచ్చి చేరుతున్నది. ఎస్సారెస్పీ పరీవాహక ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీలోకి వరద ప్రవాహం పెరుగుతున్నది. ఒక్క రోజులోనే నాలుగు టీఎంసీల వరద వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 27,835 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఆలస్యమైనప్పటికీ విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జుక్కల్ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరిగింది. సింగీతం రిజర్వాయర్‌లోకి వరద వస్తుండడంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉన్నది.
నిజామాబాద్, జూలై 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వానకాలం ప్రారంభంలో మొఖం చాటేసిన వానలు ఇప్పుడు వరుసగా కురుస్తుండడంతో ఆశాజనకంగా మారింది. ఉభయ జిల్లాల్లో సగటు వర్ష్షపాతానికి మించిన వానలు కురిసినట్లుగా అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని 22 మండలాల్లోనూ అధిక వర్ష్షపాతమే ఉంది. నిజామాబాద్ జిల్లాలో 2 మండలాల్లో ఇంకా లోటు వర్షపాతం ఉండగా మిగిలిన చోట్ల అధిక వర్షపాతం, సాధారణ వర్ష్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా చెరువుల్లోకి వరద పరుగులు పెడుతున్నది. ఉమ్మడి జిల్లాలో సుమారు 56 చెరువులు అలుగులు పోస్తున్నట్లుగా ఇరిగేషన్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. చారిత్రక నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 4.966 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఇన్‌ఫ్లో స్వల్పంగా కొనసాగుతున్నది. మెయిన్ కెనాల్ ద్వారా నీటి విడుదల 405 క్యూసెక్కుల్లో జరుగుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి బాబ్లీ గేట్లు ఎత్తడం ద్వారా భారీగా వరద వచ్చింది. తాజాగా మహారాష్ట్రలో కురిసిన వానలతోపాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో వరద పెరుగుతున్నది. సరాసరి ఇన్‌ఫ్లో 27,835 క్యూసెక్కులుగా ఉంది. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 32 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 968 చెరువులున్నాయి. 333 చెరువుల్లోకి వాన నీటి రాక షురూ కాగా 461 చెరువుల్లోకి 25 శాతం నుంచి 50శాతం మేర నీటి నిల్వ ఉన్నది. 127 చెరువులు 75శాతంలోపు జలాలతో కళకళలాడుతున్నాయి. 38 చెరువుల్లో నీటి ప్రవాహం భారీగా చేరడంతో వానలు ఇదేరకంగా కురిస్తే ఒకట్రెండు రోజుల్లోనే అలుగులు పోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. 9 చెరువులు ఇప్పటికే అలుగులు పోస్తున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 2168 చెరువులున్నాయి. ఇందులో బాన్సువాడలో 216, నిజాంసాగర్‌లో 525, కామారెడ్డిలో 528, ఎల్లారెడ్డిలో 899 చెరువులున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వానలతో అక్కడక్కడ 47 తటాకాలు అలుగులు పోస్తున్నట్లుగా ఇరిగేషన్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. 73 చెరువులు ఏకంగా 75-100 శాతం మేర నీటి నిల్వతో కళకళలాడుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. మెజార్టీ చెరువుల్లోకి నీటి ప్రవాహం మొదలవ్వగా 170 చెరువుల్లో 50శాతం మించి నీటి నిల్వ ఉండడం విశేషం.
ఖలీల్‌వాడి, జూలై 8: నిజామాబాద్ జిల్లాలో వారం రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల భారీ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారి నరేందర్ శుక్రవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా చందూరులో 25.5మి.మీ, మోస్రాలో 24.5 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా బాల్కొండ, జక్రాన్‌పల్లి, ఇందల్వాయిలో 0.8 మి.మీ, కమ్మర్‌పల్లిలో 0.7 మి.మీ వర్షపాతం నమోదు కాగా వేల్పూర్‌లో వర్షం కురవలేదు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 5.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1042.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవీపేట మండలంలో కురిసిన భారీ వర్షానికి నాళేశ్వర్లోని మాటు కాలువ తెగింది. దీంతో కాలువ కింద ఉన్న పొలాలు నీట మునిగాయి.
కామారెడ్డి జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతానికి మించి వానలు కురియడంతో జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 209.7 మి.మీ ఉండగా 326.2 మి.మీ వర్షపాతం నమోదైంది. 55.5శాతం మేర అధిక వర్షం కురిసింది. రామారెడ్డి, ఎల్లారెడ్డి, నస్రుల్లాబాద్ మండలాలను మినహాయిస్తే మిగిలిన 19 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదవ్వడం విశేషం. జూన్ మొదటి, రెండో వారానికి మొఖం చాటేసిన వానలతో రైతులు దిగాలు చెందారు. జూన్ నెలాఖరు నుంచి జూలై ప్రారంభంతో వానలు ఊపందుకున్నాయి. చాలా చోట్ల ఆలస్యంగానే పొలం పనులు మొదలు పెట్టడం దానికి తగ్గట్లుగానే వానలు పడుతుండడంతో రైతులు బిజీగా గడుపుతున్నారు. 18 మండలాల్లో సాధారణ వర్షపాతం కన్నా 20శాతం ఎక్కువగా వానలు కురిశాయి. నాలుగు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతం ఎక్కడా లేకపోవడం విశేషం. జిల్లా అంతటా సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ఇక నిజామాబాద్ జిల్లాకు వచ్చేసరికి పలు చోట్ల లోటు వర్షపాతం, మరికొన్ని చోట్ల సాధారణంగా నమోదైంది. ఎక్కువ మండలాల్లో అత్యధిక వర్షం కురవడం కాసింత ఊరటనిస్తున్నది. వానకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కురవాల్సిన సాధారణ వర్షపాతం 239 మి.మీ కాగా 309 మి.మీ కురిసింది. జిల్లా సగటు వర్షపాతంతో పోలిస్తే మొత్తంగా 31.8 శాతం ఎక్కువగానే నమోదైంది. 16 మండలాల్లో అంచనాకు మించి 20శాతానికన్నా ఎక్కువ వర్షం కురిసింది. 11 మండలాల్లో సాధారణం కాగా, ఇందల్వాయి, రుద్రూర్ మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. గడిచిన మూడు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంది. వాతావరణం సైతం ఒక్కగసారిగా చల్లబడింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల నుంచి 25డిగ్రీలకు చేరుకున్నది. రానున్న కొద్దిరోజుల్లో భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లుగా వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో వ్యవసాయ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు అప్రమత్తం అయ్యాయి.
నిజాంసాగర్, జూలై 8: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జుక్కల్ మండలంలోని కౌలాస్‌నాలా, నల్లవాగు, సింగీతం, కళ్యాణి ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో వస్తున్నా నిజాంసాగర్‌లోకి మాత్రం జాడ లేకుండా పోయింది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జుక్కల్ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టులోకి శుక్రవారం సాయంత్రానికి 127 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 458.00మీటర్ల పూరిస్థాయి నీటిమట్టానికి 456.80 మీటర్లతో 0.96 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని చెప్పారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో 1405.00 అడుగులు 17.80 టీఎంసీల సామర్థ్యానికి 1391.98 అడుగుల (4.96 టీఎంసీల) నీరు నిల్వ ఉన్నట్లు డీఈఈ శ్రావణ్‌కుమార్ తెలిపారు. సింగీతం రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో వస్తుండడంతో 416.50మీటర్ల సామర్థ్యానికి 415.15 మీటర్లకు చేరుకున్నదని, కళ్యాణి ప్రాజెక్టులో 409.50మీటర్లకు 408.50మీటర్లతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉన్నట్లు తెలిపారు.
మెండోరా, జూలై 8: మహారాష్ట్రలోని విష్ణుపురి, బాబ్లీతోపాటు గోదావరి తీర ప్రాంతాలైన నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తున్నట్లు ఏఈఈ కె.రవి తెలిపారు. విష్ణుపురి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోగా గురువారం మిగులు జలాలను విడుదల చేయడంతో శుక్రవారం తెల్లవారుజాము వరకు 2 టీఎంసీల నీరు ఎస్సారెస్పీలోకి వచ్చి చేరిందన్నారు. గోదావరి తీర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మరో 2టీఎంసీలు అర్ధరాత్రి వరకు వచ్చి చేరే అవకాశముందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 27 వేల క్యూసెక్కుల వరద వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఒక్కరోజు వ్యవధిలోనే ప్రాజెక్టులోకి 4 టీఎంసీల వరద వచ్చి చేరిందని ప్రాజెక్టు అధికారి వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు 90.313 టీఎంసీలు కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 1072.40 అడుగులు 33.976 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. కాకతీయ కాలువకు 50 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల నుంచి 50 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందన్నారు. ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్‌లోకి 18.554 టీఎంసీల వరద వచ్చి చేరిందన్నారు. గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం 1071.80 అడుగులు 32.700 టీఎంసీల నీటి నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు వివరించారు.