మోర్తాడ్/నవీపేట/బోధన్ రూరల్, జూలై 8 : మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు మోర్తాడ్‌లోని మొండివాగు, పెద్దవాగులకు జలకళ సంతరించుకుంటున్నది. మోర్తాడ్‌లో బుధవారం 23.6మిమీ, గురువారం 44.6 మి.మీ, శుక్రవారం 2.2 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. ఈ వర్షాలకు మోర్తాడ్ మొండివాగు నీరు పెద్దవాగులో కలవడంతో జలకళ సంతరించుకుంది. ధర్మోరా పెద్దవాగు కూడా పారుతున్నది. దీంతో పాలెం చెక్‌డ్యాం వద్ద నీళ్లు నిండుగా చేరుకున్నాయి.
వరుసగా కురుస్తున్న వర్షాలకు చెరువులకు కూడా జలకళ సంతరించుకుంటుంది.
నవీపేట మండలంలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాళేశ్వర్ మాటు కాలువ తెగిపోయింది. ఫలితంగా మాటు కాలువ కింద వేసిన పంట పొలా లు నీట మునిగాయి. చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోయి అలుగులు పారుతున్నా యి. జన్నేపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాటు కాల్వకు ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. బోధన్ మండలంలో గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరి నాట్లు జోరందుకున్నాయి. చిన్నచిన్న కుంటల్లోకి నీరు వచ్చి చేరుతున్నది. దీంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేశారు.