వేల్పూర్, జూన్ 17: వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కార్పొరేట్ దవాఖానను తలపిస్తున్నది. పేద ప్రజల కోసం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సొంత ఖర్చులతో దవాఖానలో సౌకర్యాలు కల్పించారు. గతంలో సౌకర్యాలు లేక పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు మంత్రికి విన్నవించగా.. తన స్నేహితుల సహకారంతో రూ.35లక్షలతో దవాఖానను మంత్రి వేముల ఆధునీకరించారు. దవాఖానను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు హాస్పిటల్‌లోని గదుల్లో టైల్స్ వేయించారు. రోగులను పరీక్షించే గదితోపాటు వైద్యులకు ప్రత్యేక హాల్ నిర్మించారు. ఆపరేషన్ థియేటర్లో నూతన సౌకర్యాలు కల్పించారు. ఎనిమిది ఐసీయూ బెడ్స్‌ను ఏర్పాటు చేయించారు. ప్రభుత్వ దవాఖాన కార్పొరేట్ హంగులను అద్దుకోవడంతో తమకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోయాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పేద ప్రజలకు ఎంతో సౌకర్యం
వేల్పూర్‌లోని ప్రభుత్వ దవాఖానను ఆధునీకరించడంతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. కరోనా సమయంలో పడిన ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. వెంటనే తన స్నేహితుల సహకారంతో సుమారు రూ.35లక్షలతో దవాఖానలో ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ఎనిమిది ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు.
-పిట్ల సత్యం, ఉపసర్పంచ్, వేల్పూర్