వేల్పూర్, జూన్ 17: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తమ గ్రామం లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎంత మొత్తుకున్నా పాలకులు పట్టించుకున్నపాపాన పోలేదు. గ్రామంలో సాగు, తాగునీటి ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా కనికరించలేదు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే మార్గమని భావించిన వేల్పూర్ మండలం మోతె గ్రామస్తులు ఉద్యమ నాయకుడు కేసీఆర్‌కు మద్దతు ప్రకటించారు.రాష్ట్రం ఏర్పడే వరకూ కేసీఆర్ వెంటే ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ సీఎం హోదాలో వచ్చి గ్రామ సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు.
అభివృద్ధి పనులు పూర్తి..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మోతె గ్రామంలో పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. సాగునీటి సమస్య పరిష్కరించేందుకు మాటుకాలువ నిర్మాణానికి రూ.3కోట్ల82లక్షలు, ప్రభుత్వ దవాఖానకు రూ.కోటీ30లక్షలు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.3కోట్లు, కప్పల వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణానికి రూ.12కోట్లు, కప్పల వాగుపై మూడు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ.15కోట్లు మంజూరు కాగా పనులు పూర్తయ్యాయి. బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.కోటి నిధులు మంజూరు కావడంతో వాటి పనులకు మంత్రి వేముల శనివారం శంకుస్థాపన చేయనున్నారు.