మోర్తాడ్, జూన్ 17: కరోనా మహమ్మారి ఒక్క కుదుపు కుది పి ప్రజలను భయకంపితులను చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ దొరక్క ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్న పరిస్థితులను చూసిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హృదయం చలించింది. బాల్కొండ నియోజకవర్గంలోని తన ప్రజలకు అలాంటి పరిస్థితులు ఎదురుకావొద్దని నిశ్చయించుకున్నదే తడువుగా.. అందుకోసం ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. రూ.1.50కోట్ల సొంత ఖర్చు, స్నేహితుల సహకారంతో పనులకు శ్రీకారం చుట్టి మోర్తాడ్ సీహెచ్‌సీలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు.
అన్ని ప్రభుత్వ దవాఖానలకు ఆక్సిజన్..
ఆక్సిజన్ తయారు చేయడమే కాకుండా నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ దవాఖానలకు ఆక్సిజన్ సిలిండర్లు మోర్తాడ్ నుంచి సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. మోర్తాడ్ సీహెచ్‌సీకి 102 ఆక్సిజన్ సిలిండర్లు రాగా అందులో పోచంపాడ్ ప్రభుత్వ దవాఖానకు 3, మెండోరా ప్రభుత్వ దవాఖానకు 3, కిసాన్‌నగర్‌కు 3, బాల్కొండకు 15, భీమ్‌గల్‌కు 4, కమ్మర్‌పల్లికి 4, చౌట్పల్లి ప్రభుత్వ దవాఖానకు 4 ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేశారు. ఈ దవాఖానలకు ఎప్పుడు అవసరమున్నా మోర్తాడ్ సీహెచ్‌సీ నుంచే ఆక్సిజన్ సరఫరా అవుతుంది. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేశారు.
మోర్తాడ్ సీహెచ్‌సీని పరిశీలించనున్న హరీశ్ రావు..
మోర్తాడ్ సీహెచ్‌సీని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు శనివారం పరిశీలించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానలకు ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకునే అవకాశం ఉందని గతంలో మంత్రి వేముల వెల్లడించిన నేపథ్యంలో శనివారం మంత్రి హరీశ్ రావు రాక ప్రత్యేకత సంతరించుకున్నది.