ధర్పల్లి, జూన్ 17 : ప్రైవేట్ కళాశాలలకు మించిన మెరుగైన విద్యాబోధన అందిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని కళాశాల ప్రిన్సిపాల్ రజీయొద్దీన్ కోరారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో అధ్యాపకులు ఇంటింటికీ తిరిగారు. పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న మెరుగైన వసతులను వివరించారు. ఉపకార వేతనాలు, ఉచిత పుస్తకాల అందజేత తదితర అంశాలపై వారికి అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరాలని విద్యార్థులను కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు విఠల్, హరిత, ప్రసన్నజ్యోతి, తిరుపతిగౌడ్, మురళి, ఖయ్యూం, సురేశ్‌బాబు, చిన్నబాలయ్య, ప్రవీణ్‌కుమార్, విఠల్, మహిపాల్, మన్సూర్ అహ్మద్ పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చదివించాలి
డిచ్పల్లి, జూన్ 17: అన్ని వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించాలని సుద్దపల్లి గ్రామ సర్పంచ్ పానుగంటి రూపా సతీశ్‌రెడ్డి కోరారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ తన కూతురిని శుక్రవారం చేర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించిందన్నారు. ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యాబోధన జరుగుతోందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల పీజీ హెచ్ఎం టి.మనోహరస్వామి ఉన్నారు.