ఖలీల్‌వాడి, జూన్ 17: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని రద్దుచేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలో శుక్రవారం ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు మాట్లాడుతూ.. నాలుగేండ్ల కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిలో సైనికులను రిక్రూట్ చేయడంతో వృత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంచడం సాధ్యంకాదన్నారు.
పెన్షన్ డబ్బును ఆదా చేసుకోవడం కోసం ఈ పథకం తీసుకువచ్చారని ఆరోపించారు. రెండేండ్లుగా భారత సైన్యంలో ఎలాంటి రిక్రూట్మెంట్ లేదన్నారు. సాయుధ బలగాల్లోకి రెగ్యులర్ సైనికులను రిక్రూట్ చేసుకోవడానికి బదులు ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. దీంతో కాంట్రాక్ట్ సైనికులు తమ నాలుగేండ్ల సర్వీస్ తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా మిగిలిపోతారన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు తావిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు పెద్ది సూరి, సుజాత, అనిల్, నాగరాజు, మహేశ్ పాల్గొన్నారు.