ఖలీల్‌వాడి, జూన్ 16 :ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ సాధించిన అనంతరం సొంత గడ్డ అయిన నిజామాబాద్‌కు నగరానికి గురువారం వచ్చిన నిఖత్ జరీన్‌కు జిల్లా ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ముందుగా పూలాంగ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ మీదుగా ఖలీల్వాడీలోని న్యూ అంబేద్కర్ భవన్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నిఖత్ జరీన్ టాపులేని జీపులో తాను సాధించిన పతకాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగగా, వివిధ క్రీడా, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, యువతీ యువకులు, విద్యార్థులు, క్రీడాభిమానులు మువ్వన్నెల జెండాలు చేతబూని నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. నిఖత్ జరీన్ రాకతో సందడి వాతావరణం సంతరించుకున్నది.
న్యూ అంబేద్కర్ భవన్ వద్ద రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, షకీల్, కలెక్టర్ నారాయణరెడ్డి, పోలీసు కమిషనర్ కెఆర్.నాగరాజు, నగర మేయర్ నీతూకిరణ్ నిఖత్ జరీన్‌కు ఘనస్వాగతం పలికారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి నిఖత్‌కు లక్ష రూపాయలు, ఆమెకు బాక్సింగ్‌లో ఓనమాలు నేర్పించిన తొలి గురువైన కోచ్ సంసాముద్దీన్కు రూ.50వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల.. నిఖత్‌కు లక్ష రూపాయల నగదు పారితోషికాన్ని అందించగా ఎమ్మెల్యే షకీల్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బోధన్ నియోజకవర్గంలో నిఖత్‌కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి నివాస స్థలాన్ని కేటాయిస్తానని ప్రకటించారు.
ఈ సందర్భంగా సన్మాన సభలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ కీడ్రా పటంలో భారతదేశం పేరునే కాకుం డా మన రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా పేరు, ప్రతిష్టలను లిఖించిన నిఖత్ జరీన్ ప్రపంచ చాంపియన్‌గా సాధించిన విజయం ఎంతో అద్భుతమైన ఘట్టమని కొనియాడారు. అనేక సవాళ్లతో, కఠోరమైన శ్రమతో కూడుకుని ఉండే బాక్సింగ్ రంగాన్ని ఎంచుకుని ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలువడం మామూలు విషయం కాదన్నారు. నిఖత్ పట్టుదలతో కొనసాగించిన కృషికి తోడు, ఆమె తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్‌ల కఠోర శిక్షణతో బాక్సింగ్ చాంపియన్ నిలిచిందన్నారు. నిజామాబాద్ బిడ్డ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ కావడం మన అందరికీ గర్వకారణమని.. నిఖత్‌ను సన్మానించే అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడా రంగానికి ఇతోదికంగా తోడ్పాటునందిస్తున్నారన్నారు.
క్రీడల్లో రాణిస్తున్న సైనా నెహ్వాల్, సానియా మిర్జా, పీవీ సింధు, మాలావత్ పూర్ణ, యెండల సౌందర్య తదితరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు అందించారని మంత్రి గుర్తు చేశారు. ప్రపంచ బాక్సర్ నిఖత్‌కు కూడా 2014-15లో జూనియర్ విభాగంలో బంగారు పతకం సాధించిన సందర్భంగా రూ.50లక్షల పారితోషికాన్ని అందించారన్నారు. తాజాగా, వరల్డ్ చాంపియన్‌షిప్ సాధించిన నేపథ్యంలో నిఖత్‌కు సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు కోట్ల రూపాయల నగదు, 600 గజాల ఇంటి స్థలంతో పాటు రాష్ట్ర పోలీసు శాఖలో సబ్ డివిజనల్ పోలీ సు అధికారిగా ఉద్యోగం ప్రకటించారని తెలిపారు. నిఖత్ జరీన్ మున్ముందు మరిన్ని అద్వితీయ విజయాలను సాధించాలని, దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ రికార్డును అధిగమించాలని మనసారా కోరుకుంటున్నట్లు మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆకాంక్షను వెలిబుచ్చారు.
కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ నిఖత్ జరీన్ భారతదేశం గొప్పదనాన్ని, రాష్ట్ర, నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని ప్రపంచానికి చాటిందని కొనియాడారు. నిజామాబాద్ కూడా విశ్వవేదికపై తిరుగు లేని పంచ్ విసరగలదని మన జిల్లా ముద్దుబిడ్డ నిఖత్ నిరూపించిందన్నారు. అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముకుంటే ప్రపంచ స్థాయిలోనూ విజయ పతాకాన్ని రెపరెపలాడించవచ్చని నిజామాబాద్ బాక్సర్ నిఖత్ నిరూపించిందని పోలీసు కమిషనర్ నాగరాజు పేర్కొన్నారు. నేటి యువత నిఖత్‌ను ఆదర్శంగా తీసుకుని తాము కోరుకున్న రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ నీతూకిరణ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గడీల రాములు, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, అమృత్‌కుమార్, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ, డీఎస్డీవో ముత్తెన్న, నిఖత్ జరీన్ తల్లిదండ్రులు పర్వీన్ సుల్తానా, జమీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
అర్బన్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సన్మానం..
ఖలీల్‌వాడి, జూన్ 16 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్, యూపీఎస్సీ ఫలితాల్లో136వ ర్యాంకు సాధించిన స్నేహ, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సిర్ప రాజు, ముక్కా దేవేందర్, ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేనిది : నిఖత్
ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించి నిజామాబాద్‌కు వచ్చిన తనకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలకడం చాలా అనందంగా ఉందని నిఖత్ జరీన్ తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. నిజామాబాద్‌లోని నిర్మల్ హృదయ్ కాన్వెంట్లో పాఠశాల స్థాయి విద్యనభ్యసించిన తాను 2009లో కోచ్ సంసాముద్దీన్ వద్ద బాక్సింగ్‌లో శిక్షణ ప్రారంభించానని తన కేరీర్ గురించి క్లుప్తంగా వివరించింది. శిక్షణ సమయంలో తన ముఖంపై గాయం కావడంతో తన తల్లి అది చూసి కంటతడి పెట్టిందని.. ముఖంపై గాయాల తాలూకు గుర్తులు ఏర్పడితే వివాహం కాదేమోనని భయపడేదని తెలిపింది. బాక్సింగ్‌లో రాణిస్తే తనను పెళ్లి చేసుకునేందుకు అనేక మంది వరుస కడుతారని చెప్పేదానినని, పట్టుదలతో కృషి చేసి నేడు ప్రపంచ చాంపియన్‌గా ఎదిగానని పేర్కొంది. సీఎం కేసీఆర్ అందించిన ప్రోత్సాహం మరువలేనిదని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. జిల్లాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తేవడం సంతృప్తిని ఇచ్చిందన్నారు. అందరి తోడ్పాటుతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని నిఖత్ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచింది.