బీర్కూర్, జూన్ 15: నియోజకవర్గంలోని పల్లెల అభివృద్ధే తన ధ్యేయమని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని దామరంచ గ్రామ శివారులోని చింతల్ నాగారం వెళ్లే దారిలో ఉన్న వాగుపై రూ.2.50కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ మా ట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు, రైతుల రవాణా సౌకర్యార్థం పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖల ద్వారా వాగులపై వంతెనలను నిర్మిస్తున్నామని అన్నారు. దామరంచ వంతెన పనులు ఎప్పుడో పూర్తికావాల్సి ఉండగా లోతు అధికంగా ఉండడంతో ఆలస్యమైందని అన్నారు. నిధులు సరిపడకపోవడంతో మరో కోటి లేదా కోటిన్నర నిధులు మంజూరవుతున్నాయన్నారు. వంతెన పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. నిజాంసాగర్ 25వ నంబరు కాలువకు రూ.15కోట్లలో సిమెంట్ లైనింగ్ చేయించామని, దీంతో చివరి ఆయకట్టు వరకు నీరు అందుతున్నదన్నారు. రైతుల కోరిక మేరకు నిజాంసాగర్ నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. దామరంచ అభివృద్ధికి ఎన్ని నిధులైనా మంజూరు చేస్తానని, మంచి నాయకత్వం వహించే ఒక్క నాయకుడూ లేడని అసంతృప్తి వ్యక్తంచేశారు. దామరంచ ప్రజలు బాగున్నారని, నాయకత్వమే బాగోలేదని అన్నారు. గ్రామంలో 35 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తే అందులో 10 మాత్రమే నిర్మాణంలో ఉన్నాయని, మిగిలిన ఇండ్లను కూడా గ్రామస్తులు నిర్మించుకునేలా చూడాలన్నారు.
నర్సింగ్ హాస్టల్ తనిఖీ..
బాన్సువాడ,జూన్ 15: బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నర్సింగ్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్థినులతో మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మున్సిపల్ కమిషనర్ కళ్యాణం రమేశ్, స్పీకర్ పీఏ భగవాన్ రెడ్డి పాల్గొన్నారు.
గుమ్మడి ఫౌండేషన్ అనాథాశ్రమం ప్రారంభం..
కోటగిరి, జూన్ 15: సామాన్య మానవుల ఆనందం కోసం తమవంతు సేవలందిస్తున్న మానవతావాదులు గుమ్మడి సుచిత్రాశ్రీధర్ దంపతులను రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామంలో గుమ్మడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుమ్మడి సుచిత్రాశ్రీధర్ రూ.7కోట్లతో ఏర్పాటు చేసిన అనాథ, వృద్ధాశ్రామాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, సురేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవత్వంతో అనాథలు, వృద్ధుల కోసం కోట్ల రూపాయలతో ఆశ్రమాన్ని నిర్మించడంతోపాటు నిర్వహణ కూడా తీసుకున్న గుమ్మడి సుచిత్రాశ్రీధర్ దంపతులను అభినందించారు. అనంతరం వారిని సన్మానించారు. ఎంపీపీ వల్లెపల్లి సునీతాశ్రీనివాస్, జడ్పీటీసీ శంకర్‌పటేల్, సర్పంచ్ నీరడి గంగాధర్, మార్కె ట్ కమిటీ చైర్పర్సన్ తేళ్ల లావణ్యాఅరవింద్, మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సిరాజ్, వైస్ ఎంపీపీ గంగాధర్‌పటేల్, మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాస్, కిశోర్‌బాబు,మండల కోఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రంగబాబు, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ విఠల్, ఎంపీడీవో మహ్మద్ అతారుద్దీన్ పాల్గొన్నారు.