కామారెడ్డి జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయింది. కేంద్రం అడ్డంకులు సృష్టించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల శ్రేయస్సే లక్ష్యంగా కొనుగోళ్ల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. జిల్లాలో 2.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం 22 మండలాల్లో 344 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, అంచనాలకు మించి ధాన్యం వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 55,775 మంది రైతుల నుంచి రూ.527 కోట్ల విలువైన 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇప్పటి వరకు రూ.376 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ధాన్యం సేకరణ పూర్తవడంతో కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ధాన్యం రవాణా, గన్నీ బ్యాగుల కొరత లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టడంతో.. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయింది.
కామారెడ్డి, జూన్ 15 : యాసంగిలో సాగు చేసిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 344 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసి ధాన్యాన్ని సేకరించారు. 22 మండలాల పరిధిలో 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సీఎం కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచి ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా పూర్తి చేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ ముగిసిందని, కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యాసంగిలో పండించిన వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం కొర్రీలు పెట్టినా అన్నదాతలకు సీఎం కేసీఆర్ అండగా నిలబడ్డా రు. ధాన్యం సేకరణ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం పై అదనపు భారం పడినా కొనుగోళ్లను పూర్తి చేసింది.
2లక్షల 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
కామారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్లో 1.60 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు 2.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. అధికారుల అంచనా మేరకు జిల్లావ్యాప్తంగా 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయడంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు ధాన్యం కొనుగోళ్లపై ఎప్పటికప్పుడూ సమీక్షలు నిర్వహిస్తూ ఇబ్బందులు తలెత్తకుండా చూశారు.
రూ.376 కోట్ల రైతుల ఖాతాల్లో జమ
ధాన్యం సేకరణ ముమ్మరంగా నిర్వహించి దేశంలోనే పంజాబ్ రాష్ట్రం తర్వాత తెలంగాణ రాష్ట్రం రెండోస్థానంలో నిలిచింది. జిల్లాలో 55,775 మంది రైతుల నుంచి 2,70,014 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. రూ.527 కోట్లకు గా ను ఇప్పటికే రూ. 376 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ధాన్యం రవాణా, గన్నీ బ్యాగుల కొరత లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టడంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేశారు. 62,78,750 గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచి కొనుగోళ్లను నిర్వహించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రెండు మండలాలను కలిపి ఒక క్లస్టర్‌గా విభజించి, క్లస్టర్ల నుంచి ప్రతిరోజూ లారీల ద్వారా ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేలా పకడ్బందీ చర్యలు చేపట్టారు. లారీల కొరత లేకుండా రైస్‌మిల్లులకు, కొనుగోలు కేంద్రాలకు అనుసంధానంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కమిటీ సమన్వయంతో పని చేసింది.
విజయవంతంగా ధాన్యం సేకరణ పూర్తి..
కామారెడ్డి జిల్లాలో 344 కొనుగోలు కేంద్రాల ద్వారా 2లక్షల 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పటి వరకు రూ.376 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ప్రజాప్రతినిధుల సహకారం.. అధికారుల సమన్వయంతో ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా పూర్తి చేశాం.
– చంద్రమోహన్, అడిషనల్ కలెక్టర్, కామారెడ్డి
అందరి సహకారంతో కొనుగోళ్లు పూర్తి
ప్రజాప్రతినిధులు, అధికారులు, రైస్‌మిల్లర్ల సహకారంతో కామారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణను సమర్ధవంతంగా నిర్వహించాం. కేంద్రాల నిర్వహణలో రెవెన్యూ, రవాణా, వ్యవసాయ, పోలీసు శాఖలు, సింగిల్ విండో, మార్కెట్ కమిటీలు, స్వయం సహాయక సంఘాలు కీలకపాత్ర పోషించాయి. ధాన్యం కాంటా జరిగిన వారం రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి.
– జితేంద్ర ప్రసాద్, మేనేజర్, పౌరసరఫరాల శాఖ