నిజామాబాద్ క్రైం, జూన్ 15 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించిన ఓ యువకుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అవమానం భరించలేక బాలిక భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. 15 రోజుల అనంతరం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో వెల్లడించారు.
స్థానిక ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో నివాసం ఉండే ఫైజల్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికకు ప్రేమ, పెళ్లి అంటూ మాయమాటలు చెప్పి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనతో తీవ్రమనస్తాపం చెందిన బాలిక గత నెల 30వ తేదీన బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. గాయాలపాలైన బాలికను ప్రైవేటు దవాఖానలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న బాలిక మంగళవారం కోమాలోంచి బయటికి వచ్చి జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో బాలిక తండ్రి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫైజల్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు తెలిపారు. అయితే ప్రస్తుతం నిందితుడు ఫైజల్ ముంబై పారిపోయినట్లు తెలిసిందని వెల్లడించారు.
నిందితుడిని త్వరలోనే పట్టుకొని జైలుకు పంపుతామని సీపీ తెలిపారు.