ఆర్మూర్, జూన్ 15 : గ్రామాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కన్న కలల రూపంగా పురుడుపోసుకున్న పథకమే పల్లె ప్రగతి కార్యక్రమమని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం కోమన్‌పల్లి, సుర్భిర్యాల్, ఫత్తేపూర్ గ్రామాల్లో బుధవారం పల్లెప్రగతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పాల్గొని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
గ్రామాల్లోని వీధులన్నీ కలియతిరుగుతూ ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామానికి బస్సు రావడం లేదని మహిళలు జీవన్‌రెడ్డి దృష్టికి తేగా వెంటనే స్పందించిన ఆయన ఆర్టీసీ అధికారితో ఫోన్లో మాట్లాడి ఫత్తేపూర్, కోమన్‌పల్లి, సుర్భిర్యాల్, పిప్రి రూటులో బస్సు నడిపితే లాభాలు వస్తాయని చెప్పారు. కోమన్‌పల్లికి బస్సు సర్వీస్ ప్రారంభించాలని విజ్ఞప్తి చేయడంతో ఆర్టీసీ అధికారులు అంగీకరించారు. జీవన్‌రెడ్డి స్వయంగా చెత్తను తొలగించారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.
అభివృద్ధి పనులతో గ్రామాలు కళకళలాడుతున్నాయన్నారు. పచ్చదనంతో పల్లెలు సరికొత్త శోభను సంతరించుకున్నాయని, పల్లెప్రగతిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహిళల పాలిట కేసీఆర్ దేవుడని, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. కోమన్‌పల్లిలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర 379 మంది లబ్ధిదారులకు ప్రతినెలా రూ.8,54,592 ఆసరా పెన్షన్లు, తదితర సౌకర్యాలతో ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు.
ఎస్సారెస్పీ ముంపు గ్రామాల అనుసంధానం..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ముంపు గ్రామాలను అనుసంధానం చేస్తూ 60 కిలోమీటర్ల పొడవునా రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని జీవన్‌రెడ్డి వెల్లడించారు. బాల్కొం డ మండలం నాగాపూర్ నుంచి నవీపేట్ మండలం బినోల వరకు వేయనున్న 60కిలోమీటర్లలో 49 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని కోమన్‌పల్లి, మగ్గిడి, ఖానాపూర్, అహ్మదాపూర్, మారంపల్లి, వన్నెల్(కె), సిద్ధాపూర్, గంగసముందర్, డొంకేశ్వర్, గాదేపల్లి, నడ్కుడ, చిన్నయానం, సిర్పూర్, అన్నారం, నికాల్పూర్, బాద్గు ణ, ఉమ్మెడ, సీహెచ్.కొండూర్ గ్రామాలను కలుపుతూ వెళ్తుందన్నారు. కోమన్‌పల్లి వద్ద ఉన్న పంపుహౌస్‌ను రోడ్డు ప్రారంభ ప్రాంతంగా నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ రోడ్డుతో బాసరకు కనెక్టివిటీ ఏర్పడుతుందని తెలిపారు. త్వరలో టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఇక్కడికి ఆహ్వానించి ఎస్సారెస్పీ ముంపు గ్రామాల పరిధిలో టూరిజం అభివృద్ధి పనులను చేపడుతామని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, సర్పంచులు సట్లపల్లి సవిత గణేశ్, కొత్తపల్లి లక్ష్మీలింబాద్రి, నీరడి రాజేశ్వర్, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ ఆర్మూర్ మండల అధ్యక్షుడు ఆలూర్ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పూజానరేందర్, టీఆర్ఎస్ నాయకులు దేగాం లింగారెడ్డి, ఉప్పునూతుల శ్రీనివాస్‌గౌడ్, పండిత్ పవన్, పండిత్ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.