మరో జల దృశ్యం ఆవిష్కృతం కానున్నది. వర్షపు నీటి వృథాను అరికట్టి, ఆ జలాలను పొలాలకు మళ్లించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా పెద్దవాగు, కప్పల వాగుపై మరో ఏడు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి కేసీఆర్ సర్కారు తాజాగా అనుమతి ఇచ్చింది. రూ.57 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆనకట్టలతో బాల్కొండ నియోజకవర్గంలోని 33 గ్రామాలకు లబ్ధి కలుగనుంది. చెక్‌డ్యామ్‌లతో భూగర్భ జలాలు పెరిగి, వేలాది ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఇప్పటికే పెద్దవాగు, కప్పల వాగు మీద నిర్మించిన చెక్‌డ్యామ్‌లతో పరిసర గ్రామాల్లో క‘న్నీటి’ కష్టాలు దూరమయ్యాయి. నాడు బీళ్లు వారిన పొలాలు నేడు పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. పుట్లకొద్దీ పంటలు పండుతుండడంతో రైతాంగం మురిసి పోతున్నది. తాజాగా మరిన్ని చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి అనుమతి లభించడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తం అవుతున్నది.
నిజామాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గోదావరి జలాలను ఒడిసి పట్టుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పథకానికి శ్రీకారం చుట్టారు. జీవనదికి ఎదురొడ్డి ఆనకట్టలు నిర్మించి నీటిని మళ్లిస్తూ కోటి ఎకరాలకు సాగు నీళ్లు అందిస్తున్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ప్రాజెక్టుతో తెలంగాణ వ్యాప్తంగా ఏడాది పొడవునా రైతులకు సాగు నీళ్లు అందుబాటులోకి వచ్చాయి. నాన్ కమాండ్ ఏరియాకూ సాగు నీళ్లు తరలించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే కోవలో సీఎం ఆలోచనలకు తగ్గట్లుగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సైతం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తన ప్రాంతంలో వాగులు, వంకల ద్వారా వృథాగా పోతున్న వరద నీటిని ఒడిసి పట్టేందుకు చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని యోచించారు. ఇందుకు తగ్గట్లుగా తన ప్రణాళికలను సీఎం కేసీఆర్ ముందు పెట్టి ఆమోదముద్ర వేయించుకుని చకచకా చెక్‌డ్యామ్‌లను నిర్మిస్తున్నారు. భూగర్భ జలాల పెంపుతో పాటుగా స్థానిక రైతన్నలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు భగీరథ ప్రయత్నాలే చేస్తున్నారు.
సజీవ సుజల దృశ్యం..
గోదావరి నదీ పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్న నిజామాబాద్ జిల్లాలో వాగులు, వంకలు అనేకం. ప్రతి మండలంలోనూ వరద నీటిని మోసుకొచ్చే వాగులు బోలెడన్ని ఉన్నాయి. దశాబ్దాలుగా వరద నీటితో సహజ సిద్ధంగా ఏర్పడిన వాగుల అంతిమ గమ్యం గోదావరి నదే. ఆయా గ్రామాల ద్వారా గుట్టలు, అడవుల గుండా ప్రయాణించి చివరకు జీవనదిలో వాగులన్నీ సంగమిస్తుంటాయి. ఏడాదిలో అగ్రభాగం ఎడారిలా కనిపించే అనేక వాగు లు.. సీజన్లో చిన్నపాటి వానలతో జల కళతో దర్శనం ఇస్తుంటాయి. వీటితో స్థానిక ప్రజానీకానికి, రైతులకు ఉపయోగం అంతంత మాత్రమే. వాగులపై ఆనకట్టలు లేకపోవడం, నేలపై కురిసిన చినుకులు నేరుగా వరదై కిందికి పోవడమే తప్ప ఎక్కడా ఉపయోగకరం లేదు. వృథాగా పోతున్న వాన నీటిని ఒడిసి పట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వాగులపై చెక్‌డ్యామ్‌లను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా బాల్కొండలో పదుల సంఖ్యలో ఆనకట్టలు రూపుదిద్దుకున్నాయి. గతేడాది పెద్ద వాగు, కప్పల వాగులపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ల ద్వారా కొన్ని కిలోమీటర్ల మేర వరద నీరు నిలిచింది.
పెద్ద వాగు, కప్పల వాగు మురిసేలా..
బాల్కొండలో ప్రధానంగా రెండు వాగులున్నాయి. పెద్ద వాగు, కప్పల వాగులు వివిధ మండలాల మీ దుగా ప్రవహించి చివరాఖరకు జీవ నదిలో కలిసి పోతుంది. వాన పడినప్పుడు ఉప్పొంగి ప్రవహించే వీటిపై చెక్‌డ్యామ్‌లను నిర్మించడం ద్వారా నీరు ని లకడగా ఉంటుంది. తద్వారా చుట్టు పక్కల భూగ ర్భ జలాలు పెరిగి రైతుల బోర్లలో జల జీవం కనిపిస్తుంది. రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్‌తో నిరంతరం సాగుకు ఢోకా లేకుండా నీటిని మళ్లించుకోవచ్చు. ఏడాది పొడవునా రెండు పంటలు పండించుకునే వెసులుబాటు ఈ చెక్‌డ్యామ్‌ల ద్వా రా కలుగుతున్నది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వేము ల ప్రశాంత్‌రెడ్డి ప్రధానంగా 23 చెక్‌డ్యామ్‌లను ఈ వాగులపై నిర్మించాలని తలచారు. అందు కు అనుగుణంగా గతేడాది నిజామాబాద్ జిల్లాకు రూ. 160 కోట్లతో 30 చెక్‌డ్యామ్‌లు మంజూరు కా గా, అందులో 10 బాల్కొండ నియోజకవర్గానికి చెందినవే ఉన్నాయి. తాజాగా రూ.57 కోట్లతో మ రో ఏడు చెక్‌డ్యామ్‌లకు మంజూరు రావడంతో స్థానిక రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీ టిలో నాలుగు చెక్‌డ్యామ్‌లను పెద్ద వాగుపై, మూ డు చెక్‌డ్యామ్‌లను కప్పలవాగుపై నిర్మించబోతున్నారు.
33 గ్రామాలకు లబ్ధి… వేల ఎకరాలకు ఊపిరి..
కప్పల వాగు, పెద్ద వాగులపై నిర్మించబోయే చెక్‌డ్యాంలతో బాల్కొండ నియోజకవర్గంలోని 33 గ్రామాలకు మేలు కలుగనున్నది. ఆనకట్టల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతీ చెక్‌డ్యామ్ చెంత దాదాపుగా 2.5 కిలో మీటర్ల నుంచి 3 కిలో మీటర్ల వరకు వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ చారిత్రక వాగులు వానకాలం కాకుండా మిగిలిన కాలాల్లో ఖాళీగా కనిపించకూడదని మంత్రి వేముల లక్ష్యంగా పెట్టుకున్నారు. విరివిగా చెక్‌డ్యామ్‌లు నిర్మించడం ద్వారా ఒక చెక్‌డ్యామ్ నీరు మరో చెక్ డ్యామ్‌కు తాకేలా డిజైన్ రూపకల్పన చేశారు. మరోవైపు ప్రతి చెక్‌డ్యామ్ ద్వారా వాగుకు ఇరువైపులా 2 కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగి బోర్లలో సమృద్ధిగా నీళ్లు వస్తాయి. రైతులకు చేతి నిండా పని దొరికేలా చేయడమే ప్రధాన ఉద్దేశమని పలుసార్లు సమీక్షా సమావేశాల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి వివరించారు.
చెక్‌డ్యామ్‌లతో బాల్కొండ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీటి ప్రయోజనం కల్పించడమే ధ్యేయంగా పని చేస్తున్నారు. కప్పల వాగు, పెద్ద వాగుపై ఆనకట్టల నిర్మాణాలు చేపట్టడం ద్వారా సుమారుగా 45 కిలో మీటర్ల మేర జల కళ సంతరించుకోవడం తథ్యమని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
రుణపడి ఉంటాం..
గతంలో వాగులో చుక్క నీరు ఉండేటిది కాదు. బోర్లు ఎత్తిపోయి పంటలు ఎండిపోయేటివి. మంత్రి ప్రశాంత్‌రెడ్డి వాగుపై చెక్ డ్యామ్ కట్టించిండు. దీంతో బోర్లు ఫుల్లుగా పోస్తున్నయి. ఏడాదికి రెండు పంటలు పండుతున్నయి. సీఎం కేసీఆర్,మంత్రి ప్రశాంత్‌రెడ్డికి రుణపడి ఉంటాం.
– కర్నే గంగారాం, రైతు, భీమ్‌గల్
పంటలు ఎండిపోయేటియి..
చెక్‌డ్యామ్ కట్టుడుతోటి మస్తు మేలు జరిగింది. గతంలో నీటి ఎద్దడితో పంట పొలాలు ఎండిపోయేటివి. గత పాలకులు రైతులను పట్టించుకోలే. దానికి తోడు కరెంటు, నీటి సమస్య. మంత్రి ప్రశాంత్‌రెడ్డి ముందుచూపుతోటి కప్పల వాగుపై చెక్‌డ్యామ్ కట్టించిండు. దీంతోని వాగు చుట్టు ఉన్న పొలాలకు మూడు కాలాలు నీళ్ల సమస్య దూరమైంది. ఆనకాలం నుంచి మళ్ల ఆనకాలం దాకా చెక్‌డ్యామ్‌లో నీళ్లు ఉంటున్నయి. ఎండాకాలంల నీళ్లు ఉండుడు చూసి సంతోషంగా అనిపిస్తుంది.
– అవుసుల నర్సయ్య, రైతు, గోన్‌గొప్పుల
పుష్కలంగా నీళ్లు..
గతంలో మా పెద్దలు పంటలు పండించేందుకు నీళ్లు లేక మస్తు కష్టాలు పడ్డారు. నీళ్లు లేక, దిగుబడి రాక చాలా నష్టపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నీళ్లు, కరెంటుపై దృష్టి పెట్టిన్రు. ముందుచూపుతో వాగులపై చెక్‌డ్యామ్‌లను నిర్మించారు. వాటిని కట్టడంతో వాగుల నీళ్లను ఆపినట్లయింది. దీంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లలో నీళ్లు పుష్కలంగా వచ్చాయి. దీంతోటి పంటలకు నీటి సమస్య తీరినట్లయింది. చెక్‌డ్యామ్ నిర్మాణంతోని రైతులకు చాలా మేలు జరిగింది.
– గట్టు శ్రావణ్, యువ రైతు, గోన్‌గొప్పుల