వేల్పూర్, జూన్ 14: బాల్కొండ నియోజకవర్గానికి ప్రభుత్వం మరో ఏడు చెక్‌డ్యాములను మంజూరుచేయడంపై రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం నియోజకవర్గ రైతులు, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వేల్పూర్ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నియోజకవర్గంలోని పెద్దవాగు మీద నాలుగు, కప్పలవాగు మీద మూడు చెక్‌డ్యాముల నిర్మాణానికి సుమారు రూ.57. 8 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్ దయతో బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికే 16 చెక్‌డ్యాములు నిర్మించుకున్నామని, మరో ఏడు చెక్‌డ్యాములను మంజూరుచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు ఆజన్మాంతం రుణపడి ఉంటానన్నారు. చెక్‌డ్యాముల నిర్మాణంతో కప్పల వాగు, పెద్దవాగు పరీవాహక ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగి బోర్లు రీ జనరేట్ అయినట్లు గుర్తు చేశారు. సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నదన్నారు. ప్యాకేజీ -21 ద్వారా నియోజకవర్గంలో మరో 80 వేల ఎకరాలకు త్వరలో సాగునీరందించనున్నట్లు చెప్పారు. ఇటీవల రూ.35 కోట్లతో 100 పడకల దవాఖాన నిర్మాణానికి మంజూరునిచ్చిన కేసీఆర్.. నేడు రూ. 57 కోట్లతో చెక్‌డ్యాములు మంజూరు చేశారన్నారు. రైతునాయకుడు, తన తండ్రి దివంగత వేముల సురేందర్‌రెడ్డికి ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యంతో చెక్‌డ్యాములు మంజూరు జరిగిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.
బాల్కొండ నియోజకవర్గ ప్రజలంటే సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ, అభిమానమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్లు నాగధర్, దొన్కంటి నర్సయ్య, ఎంపీపీలు ఆర్మూర్ మహేశ్, బీమా జమున, జడ్పీటీసీలు రవి, అల్లకొండ భారతి, మార్కెట్ కమిటీ చైర్మన్లు కొట్టాల చిన్నారెడ్డి, సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు రేగుళ్ల రాములు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.