భీమ్‌గల్, జూన్ 14 : భీమ్‌గల్ మండలంలో అర్బన్ పార్కుతో పాటు సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలోని అడవిని ఆధునిక పద్ధతిలో పునరుద్ధరణ చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. భీమ్‌గల్ పట్టణానికి సమీపంలో ఉన్న లింబాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ పరిసరాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కు కోసం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. అటవీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన ప్రాంతంలో మొక్కలు నాటారు. పార్కుకు సంబంధించిన ప్రతిపాదనలు, నిర్మాణంపై మంత్రికి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన మరో వినూత్న ఆలోచన అర్బన్ ఫారెస్ట్ పార్కు అని అన్నారు.
ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుతో పట్టణ సమీపంలోని వాసులకే కాకుండా సమీప గ్రామాల ప్రజలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. లింబాద్రిగుట్ట సమీపంలో ఏర్పాటు చేయనున్న అర్బన్ ఫారెస్ట్ పార్కు భీమ్‌గల్ పట్టణ వాసులతో పాటు బాచన్పల్లి, పిప్రి, మెండోరా, పల్లికొండ గ్రామాల ప్రజలకు స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కూడా సేద తీరేందుకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. పార్కులో ఐదు కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్కు, ఓపెన్ జిమ్, లైటింగ్, వాష్ రూమ్స్, చేంజింగ్ రూమ్, వాచ్ టవర్లు, చిట్టడివి, కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయడానికి రూ. 6 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు. త్వరలో పార్కుకు సంబంధించిన ప్రతిపాదనలపై అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో హైదరాబాద్‌లో సమావేశమై చర్చిస్తానన్నారు.
భీమ్‌గల్ పట్టణ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కు లింబాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆశీస్సులతో త్వరలో మంజూరై అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నామన్నారు. సీఎం కేసీఆర్, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి వెంట జిల్లా ఫారెస్ట్ అధికారులు సునీల్ ఈరమన్, ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శర్మానాయక్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, పలు గ్రామాల సర్పంచులు ఉన్నారు.