జక్రాన్‌పల్లి, జూన్ 14: మన ఊరు-మన బడిలో భాగంగా చేపడుతున్న పనులతో ప్రభు త్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో స్పష్టమైన మార్పును సంతరించుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని మనోహరాబాద్ గ్రామంలో కలెక్టర్ మంగళవా రం ఆకస్మిక తనిఖీలు చేశారు. గ్రామంలో ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్‌యార్డ్, ప్రభు త్వ పాఠశాలను పరిశీలించారు. మన ఊరు- మనబడి కింద పాఠశాలలో కొనసాగుతున్న పనులను పరిశీలించి నాణ్యతతో జరిగేలా చూడాలని ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా ఎస్ఎంసీ సభ్యులు పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నా రు. గ్రామంలో చేపట్టిన పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రకృతి వనం, వైకుంఠధామం, పాఠశాలల్లో మొక్కలను నాటాలని సర్పంచ్ గంగాధర్‌కు సూచించారు. అనంతరం తహసీల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి అక్కడి నుంచి జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పల్లె ప్రగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మల్లేశ్, ఎంపీడీవో లక్ష్మణ్, ఎంఈవో శ్రీనివాస్, ఏపీవో రవి ఉన్నారు.
మెరుగైన సేవలకోసమే అటెండెన్స్ యాప్
ఇందూరు, జూన్ 14: వైద్యారోగ్య శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందాలన్న ఉద్దేశంతోనే అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇకముందు కూ డా ఇదే పద్ధతి కొనసాగుతుందని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. అటెండెన్స్ యాప్ ద్వా రా ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్నది తమ అభిమ తం కాదన్నారు. వైద్యారోగ్య శాఖ పనితీరుపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకు అందరినీ పని చేయించాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రతి పీహెచ్సీ, హెల్త్ సబ్సెంటర్లలో నీటి వసతి, విద్యుత్, టాయిలెట్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, సొం త, అద్దె భవనాలు లేని కేంద్రాల వివరాలను నివేదిక రూపంలో పంపాలని సూచించారు. ప్రతి నివాస ప్రాంతంలోనూ గర్భిణుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, వలస వచ్చి స్థానికంగా ఉంటున్న వారి వివరాలను కూడా జాబితాలో చేర్చాలని కలెక్టర్ సూచించారు. బోధన్, భీమ్‌గల్, నిజామాబాద్ అర్బన్ తదితర ప్రాంతాల్లో వలస వచ్చిన గర్భిణుల వివరాలను రెండు రోజుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లోనే కాన్పులు జరిగేలా ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో కంటి వెలుగు ద్వారా రోజుకు కనీసం 50కు తగ్గకుండా క్యాటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సుదర్శనం, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారిణి ఝాన్సీ, పీవో డాక్టర్ అంజన, జిల్లా జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తదితరులు పాల్గొన్నారు.