నిజామాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత – దేవనపల్లి అనిల్ దంపతులు సంకల్పించిన శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నృసింహస్వామి దేవాలయ ప్రతిష్ఠాపనోత్సవం గురువారం అంగరంగ వైభవంగా ముగిసింది. తమ ఇంటి దేవుడికి ఆలయాన్ని నిర్మించాలన్న ఆశయాన్ని అనుకున్న విధంగా అట్టహాసంగా నెరవేర్చుకున్నారు. దేవనపల్లి రాంకిషన్ రావు – నవలత దంపతుల సహకారం, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు – శోభ దంపతుల ఆశీస్సులతో జరిగిన మహా క్రతువుకు చివరి రోజు భక్తజనం పోటెత్తారు. ఓ వైపు జనం రాక, మరోవైపు ప్రముఖుల సందర్శనతో నందిపేట మండలంలోని సీహెచ్ కొండూర్ కిక్కిరిసింది. సందడి వాతావరణంలో చివరి రోజు ఆఖరి ఘట్టంలో మహా పూర్ణాహుతి యాగశాల ఉద్వాసన చేపట్టారు. వేద విన్నపాలు, శాంతి కల్యాణం, మహదాశీర్వచనం, పండిత సన్మానంతో ఉత్సవాన్ని సంపూర్ణం చేశారు. యాగ ఫలం సిద్ధించినట్లు శుభసూచకంగా గురువారం ఉదయం వరుణ దేవుడి ఆశీర్వచనాలు సైతం నిర్వాహకులకు దక్కాయి. గంటన్నర పాటు కురిసిన వర్షంతో భక్తులు పులకించి పోయారు. యాగ ఫలితమేనంటూ సంబురం వ్యక్తం చేశారు.
భక్తుల పరవశం..
ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన ఆలయ ప్రతిష్ఠాపనోత్సవంలో దేవనపల్లి కుటుంబీకులు భక్తిప్రపత్తులతో వైదిక క్రతువులను నిర్వహించారు. ఆరు రోజుల పాటు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 6 నుంచి రాత్రి 9.30 గంటల వరకు నారసింహుడి సేవలోనే తరించారు. ఆలయ నిర్మాణానికి సంకల్పించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత – దేవనపల్లి అనిల్ కుమార్, దేవనపల్లి రాంకిషన్ రావు – నవలత , దేవనపల్లి అరుణ్ కుమార్ – ననిత దంపతులు, బంధుగణం భారీ సంఖ్యలో హాజరై శ్రీలక్ష్మీ నృసింహ స్వామిని కొలిచారు. ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించిన పూర్తి కార్యక్రమాల అనంతరం గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠించబడిన దేవతామూర్తులను గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాధారణ ప్రజానీకానికి దర్శన భాగ్యం కల్పించారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన వారంతా బారులు తీరి దేవతామూర్తుల దర్శనం చేసుకున్నారు. ఇటు భక్తజనంతోపాటు దేవనపల్లి వంశీయులంతా ఆరు రోజుల పాటు తన్మయత్వంలో మునిగితేలారు. లోక కల్యాణార్థం ఐదు రోజుల పాటు నిర్విఘ్నంగా పూర్ణాహుతి నిర్వహించారు. చివరి రోజు శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహ స్వామి తిరు కల్యాణాన్ని నరసింహ స్వామి ఉపాసకులు వేదాల భార్గవ నరసింహ స్వామి ఆధ్వర్యంలో రమణీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారసింహుని జయజయ ధ్వానాలు, గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
ప్రముఖుల సందడి..
ఆరో రోజు కార్యక్రమంలో దేవతామూర్తుల కల్యాణోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ, కుటుంబీకులు పాల్గొన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దంపతులు సైతం కల్యాణోత్సవానికి హాజరయ్యారు. పూజా కార్యక్రమాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు పాలుపంచుకున్నారు. గర్భగుడిలో ప్రతిష్ఠించిన శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని కొలిచారు. ఫల, పుష్పాలను దేవుళ్లకు సమర్పించారు. దైవ కార్యాన్ని దిగ్విజయంగా నిర్వహించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత- అనిల్ దంపతులను అభినందించారు. పోచారం దంపతుల కాళ్లకు నమస్కరించి కవిత దంపతులు ఆశీర్వచనాలు పొందారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి దంపతులు సైతం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అతిథులకు శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ప్రతిమ, కండువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలను కవిత దంపతులు అందజేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, సీపీ నాగరాజు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, డాక్టర్ పోచారం రవీందర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజీత్ సింగ్ ఠాకూర్, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సేవలకు గుర్తింపు.. ఘనంగా సత్కారాలు..
ఆరు రోజులపాటు నిర్వహించిన శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనృసింహస్వామి స్వామి ఆలయ జీర్ణోద్ధారణ కార్యక్రమంలో భాగమైన వ్యక్తులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత-దేవనపల్లి అనిల్ కుమార్ దంపతులు ఘనంగా సత్కరించారు. వేద పఠనంతో ఆరు రోజుల పాటు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన రుత్వికులు, ఆలయ నిర్మాణం నుంచి ప్రారంభోత్సవం వరకు సహకరించిన సీహెచ్ కొండూర్ గ్రామంలోని పెద్దలను సన్మానించారు. దేవాలయ నిర్మాణానికి భూదానం చేసిన దాతలను, సీహెచ్ కొండూర్ సర్పంచ్ దమ్మన్నగారి ప్రభాకర్ రావు దంపతులతో పాటు ఎంపీటీసీ రాజు, గ్రామాభివృద్ధి కమిటీ బాధ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలియజేస్తూ సత్కరించారు. ఆరు రోజుల పాటు ఉద యం అల్పాహారం, మధ్యాహ్నం తెలుగు వంటకాలతో చక్కని భోజనం, రాత్రి సైతం విభిన్న వంటలతో అతిథులకు, భక్తులకు భోజన సౌకర్యాన్ని కల్పించారు. దేవాలయానికి వచ్చిన వారందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు తమిళనాడు నుంచి తెప్పించిన పవిత్రమాలను అందజేశారు. భక్తుల మెడలో పవిత్రమాలను వేసి మహాక్రతువులో వారందరినీ భాగం చేశారు.