వేద మంత్రోచ్ఛారణాలు.. శాస్ర్తోక్తంగా వైదిక క్రతువులు.. భక్తుల జయ జయ ధ్వానాల నడుమ శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కొలువు దీరారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత – దేవనపల్లి అనిల్ దంపతులు తమ ఇంటి దేవుడికి ఆలయాన్ని నిర్మించాలన్న సంకల్పాన్ని అనుకున్న విధంగా భక్తిశ్రద్ధలతో నెరవేర్చుకున్నారు. నందిపేట మండలం సీహెచ్ కొండూరులో ఆరు రోజుల పాటు వైభవోపేతంగా కొనసాగిన ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు గురువారంతో సంపూర్ణమయ్యాయి. సందడి వాతావరణంలో చివరి రోజు ఆఖరి ఘట్టంలో మహా పూర్ణాహుతి యాగశాల ఉద్వాసన చేపట్టారు. వేద విన్నపాలు, శాంతి కల్యాణం మహదాశీర్వచనం, పండిత సన్మానంతో ఉత్సవాన్ని సమాప్తం చేశారు.
దేవనపల్లి రామ్‌కిషన్‌రావు – నవలత దంపతుల సహకారం, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు – శోభ దంపతుల ఆశీస్సులతో జరిగిన మహా క్రతువుకు చివరి రోజు భక్తజనం పోటెత్తారు. ఓ వైపు జనం రాక, మరోవైపు ప్రముఖుల సందర్శనతో నందిపేట మండలంలోని సీహెచ్ కొండూర్ కిక్కిరిసింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సతీసమేతంగా చివరి రోజు ప్రతిష్ఠాపనోత్సవాల్లో పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత-డీఆర్ అనిల్ కుమార్, దేవనపల్లి నవలత-రాంకిషన్‌రావు, దేవనపల్లి ననిత-అరుణ్‌కుమార్ దంపతుల ఇలవేల్పు శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు గురువారంతో సంపూర్ణమయ్యాయి. ఆరు రోజుల పాటు విశేషపూజలు, వైదిక క్రతువులు, నారసింహ నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. ప్రతి రోజూ వేలాది సంఖ్యలో భక్తులతోపాటు ప్రముఖుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. చివరి రోజు పూజల్లో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.