ఇందూరు, జూన్ 9 : పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ధేశిత లక్ష్యానికి మించి రైతాంగానికి రుణాలు అందించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ నారాయణరెడ్డి బ్యాంకర్లను కోరారు. కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో గురువారం జిల్లాస్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గతేడాది కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై బ్యాంకుల వారీగా సమీక్షించారు. కొన్ని బ్యాంకుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి రైతూ రుణసదుపాయాన్ని పొందేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావుకు సూచించారు. రుణాల రివకరీకి అవసరమైతే జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయి సహకారమందిస్తుందన్నారు.
గతేడాదితో పోలిస్తే కొంతవరకు రుణ పంపిణీలో ప్రగతి ఉన్నప్పటికీ మరింతగా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.3550.68 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యం కాగా, రూ.2953.35 రుణాల పంపిణీ పూర్తి చేసి 83.18 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పారు. వచ్చే త్రైమాసికం నాటికి రుణ పంపిణీ 95 శాతం దాటాలని, టర్మ్‌లోన్స్ 90 శాతానికి మించి పంపిణీ జరగాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా రుణాలు అందించాలన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడి వస్తున్న నేపథ్యంలో అందుకనుగుణంగా రైస్‌మిల్లులు ఏర్పాటు కావాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. రైస్‌మిల్లుల ఏర్పాటు కు ముందుకు వచ్చే ఔత్సాహికులకు రుణాలు అందించి ప్రోత్సహించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. విద్యారంగానికి మానవీయ కోణంలో రుణాలు అందించాలని హితవు పలికారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తిస్థాయిలో లింకేజీ రుణాలు పంపిణీ చేయాలని, సబ్సిడీ రుణాల పంపిణీలో అలసత్వాన్ని ప్రదర్శించవద్దన్నారు.
సబ్సిడీ రుణాలు పొందిన లబ్ధిదారులు యూనిట్లను నెలకొల్పేలా చూడాలని, యూనిట్లను ప్రారంభించనిపక్షంలో సబ్సిడీ మొత్తాన్ని రికవరీ చేయాలని ఆయా సంక్షేమశాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దళితబంధు పథకం ద్వారా తొలి విడుతలో జిల్లాలో 550 మంది లబ్ధిదారులకు స్వయం సమృద్ధి సాధించేందుకు వీలు గా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వివిధ యూనిట్లను మంజూరు చేసిందని కలెక్టర్ పేర్కొన్నారు. లబ్ధిదారులు తమ యూనిట్లను మరింత విస్తరించుకునేందుకు వీలుగా స్టాండ్ ఆఫ్ ఇండియా కింద బ్యాంకర్లు వారికి తోడ్పాటునందించాలని సూచించారు. కనీసం 100 మందికైనా లబ్ధి చేకూర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంకు మేనేజర్‌కు సూచించారు.
వార్షిక రుణ ప్రణాళిక విడుదల
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ నారాయణరెడ్డి విడుదల చేశారు. పంట రుణాల కింద రూ.3846.89 కోట్ల రుణ పంపిణీ లక్ష్యంగా నిర్దేశించారు. చిన్న నీటివనరులకు రూ.87కోట్లు, భూమి అభివృద్ధికి రూ.43.92 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.252.77 కోట్లు, మొక్కల పెంపకం, ఉద్యానవన రంగానికి రూ.140.58 కోట్లు, పశుసంవర్ధకశాఖకు రూ.252.77 కోట్లు, మొక్కల పెంపకం, ఉద్యానవన రంగానికి రూ.140.58 కోట్లు, పశుసంవర్ధక, పాడిపరిశ్రమకు రూ.178.23 కోట్లు, మేకలు, గొర్రెల పెంపకానికి రూ.29.57 కోట్లు, కోళ్ల పెంపకానికి రూ.74.53 కోట్లు, పంట ఉత్పత్తుల నిలువ, మార్కెటింగ్ సదుపాయాల కోసం రూ.136. 88 కోట్లు, అటవీ, నిరుపయోగ భూముల అభివృద్ధి కోసం రూ.8.60 కోట్లు, మత్స్యపరిశ్రమకు రూ.17.12 కోట్లు, ఇతర రంగాలకు రూ.434.81 కోట్ల చొప్పున రుణాలు అందించాలని లక్ష్యంగా వివరించారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలకు లింకేజీ రుణాల కింద రూ.530 కోట్లు, ప్రాధాన్యత రంగాలకు రూ.1457.53 కోట్లు, ఇతర రంగాలకు రూ.260.24 కోట్లు అప్రాధాన్యత రంగానికి రూ.175 కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. సమావేశంలో నాబార్డు ఏజీఎం నాగేశ్, ఆర్బీఐ అధికారి రాజేంద్రప్రసాద్, డీఆర్డీవో చందర్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.