బీర్కూర్, జూన్ 9 : భక్తిమార్గంలో నడిచేవారు ఇతరులను మోసం చేయరని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని మల్లాపూర్ గ్రామంలో దేవాదాయ శాఖ ద్వారా రూ. 21 లక్షలతో నిర్మించిన హనుమాన్ ఆలయ ప్రారంభోత్సవం, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మల్లాపూర్ గ్రామం తనకు పోచారం గ్రామంతో సమానమని, గ్రామం చిన్నదైనా ఈ గ్రామప్రజల మనసు చాలా పెద్దదని అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి మొదటగా అంకురార్పణ చేసింది తన శిష్యుడు ద్రోణవల్లి సతీశ్ అని గుర్తుచేశారు. మల్లాపూర్‌లో నిర్మించిన 40 డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలో పంపిణీ చేస్తామని చెప్పారు. వ్యక్తిగత ఇండ్లు నిర్మించుకునే వారికి ఇండ్లను మంజూరు చేస్తామని హామీఇచ్చారు.
ఒక్క బాన్సువాడ నియోజకవర్గంలోనే 11 వేల 600 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు సుమారు 100 కోట్ల రూపాయలను అందజేశామని తెలిపారు. మల్లాపూర్‌లో ఫంక్షన్‌హాల్ నిర్మించుకునేందుకు రూ. 25 లక్షలు అందజేస్తానని హామీ ఇచ్చారు. కోటగిరి మండలం బస్వాపూర్ గ్రామం నుంచి భైరాపూర్ గ్రామం మీదుగా మల్లాపూర్ ద్వారా తెలంగాణ తిరుమల దేవస్థానానికి మూడున్నర కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు వేస్తున్నామని తెలిపారు. బీర్కూర్ నుంచి తెలంగాణ తిరుమల ఆలయానికి మట్టిరోడ్డును కూడా బీటీ రోడ్డుగా మార్చేందుకు రూ. 50 లక్షలు మంజూరు చేశానని చెప్పారు. మల్లాపూర్‌లో హనుమాన్ ఆలయ నిర్మాణానికి కృషిచేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి, ఆలయ నిర్మాణ దాత ద్రోణవల్లి సతీశ్‌కు జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం కాశీ పీఠాధిపతి భాస్కరశర్మ భక్తులకు ప్రవచనాలు చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు సత్ప్రవర్తనను నేర్పించాలన్నారు. అనంతరం ధ్వజారోహణం, హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణ దాత ద్రోణవల్లి సతీశ్, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం రవీందర్‌రెడ్డి, పోచారం సురేందర్‌రెడ్డి, దొడ్ల పెద్ద వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ తిలకేశ్వరి రఘు, జడ్పీటీసీ సభ్యురాలు స్వరూప, దేవాదాయ శాఖ ఏసీ సోమయ్య, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.