నవీపేట, జూన్ 9: మండల కేంద్రంలోని పెట్రోల్‌బంక్ సమీపంలో లారీ, కారు ఢీకొన్న ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ నుంచి మహారాష్ట్రకు శనగల లోడ్‌తో వెళ్తున్న లారీ.. రెంజల్ మండలం కళ్యాపూర్ గ్రామానికి చెందిన కారును నవీపేటలో ఢీకొన్నది.
కారు అక్కడే కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. కారులో కళ్యాపూర్‌కు చెందిన లావణ్యతో పాటు నలుగురు ఉన్నారు. లావణ్య వివాహం ఈనెల 25న ఉండడంతో బట్టలు కొనేందుకు నిజామాబాద్ వెళ్తున్నారు. ప్రమాదం జరిగి న సమయంలో కారు బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. కారులో ఉన్న లావణ్యతో పాటు లారీ డ్రైవర్ రాంబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు.