బోనకల్లు, ఫిబ్రవరి 20: ఇంటర్ వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రథమ సంవత్సరం విద్యార్థిని కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన బోనకల్లు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ముదిగొండ మండలం మదాపురం గ్రామానికి చెందిన తుడుం సమీరా బోనకల్లు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తరగతులు కొనసాగుతున్న సమయంలోనే సమీరా టాయిలెట్‌కు వెళ్లొస్తానని చెప్పి బయటకు వెళ్లింది. అయితే ఆమె టాయిలెట్‌కు వెళ్లకుండా మూడో అంతస్తులోకి వెళ్లి.. అక్కడి గేటు తాళాన్ని తన వద్ద ఉన్న తాళం చెవితో తీసి పైకి వెళ్లింది.
భవనం వెనుక వైపు ఉన్న రైతు వేదిక దిశగా కిందకు దూకింది. దీంతో ఒక్కసారిగా శబ్ధం రావడంతో రైతు వేదికలో శిక్షణ పొందుతున్న గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ఒక్కసారిగా బయటకు వచ్చి గమనించారు. ఇసుకలో కిందపడిన బాలికను పరిశీలించగా.. ఆమె చేయి, కాలు, నడుముకు తీవ్ర గాయాలు కావడంతో ద్విచక్ర వాహనంపై స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ప్రాణాపాయం తప్పడంతో అధ్యాపకులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
కాగా.. సమీరా గురువారం రాత్రి నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నదని, పరీక్షల్లో పాస్ అవుతానో లేదో అనే భయంతో మానసిక ఒత్తిడికి గురైనట్లు తోటి విద్యార్థులు తెలిపారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులను మోటివేషన్ చేస్తున్నా బాలిక అఘాయిత్యానికి పాల్పడిందని కళాశాల ప్రిన్సిపాల్ వెంకట పద్మావతి వివరించారు. అయితే బాలిక భవనం పైనుంచి దూకిన విషయం తెలుసుకున్న తహసీల్దార్ మద్దెల రమాదేవి, ఎంఈవో దామాల పుల్లయ్య గురుకుల పాఠశాలకు చేరుకొని ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులను ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు చెప్పారు.