భీమ్‌గల్, జూన్ 9: పట్టణ ప్రగతి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. భీమ్‌గల్ మూడో వార్డులో కౌన్సిలర్ మూత లతతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేందర్ పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులోఅవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో బల్దియా చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ప్రసవాలను ప్రభుత్వ దవాఖానల్లో చేసుకునేలా చైతన్య పర్చాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ రాజేందర్, కౌన్సిలర్లు నర్సయ్య, సతీశ్, తుమ్మ భూదేవి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ దవాఖాన వైద్యులపై మండిపడ్డ వార్డు ప్రజలు..
భీమ్‌గల్ ప్రభుత్వ దవాఖాన మెడికల్ ఆఫీసర్ సిబ్బందిపై వార్డు ప్రజలు, మహిళలు మండిపడ్డారు. దవాఖానకు ఎప్పుడు వెళ్లినా అందుబాటులో ఉండడం లేదని, సిబ్బంది తీరు కూడా సరిగ్గా లేదన్నారు. అక్కడికి వెళితే సరైన సమాధానం ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కోరారు.
పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్..
శక్కర్‌నగర్, జూన్ 9: బోధన్ పట్టణంలో కొనసాగుతున్న పట్టణ ప్రగతి పనులను బల్దియా కమిషనర్ రామలింగం స్థానిక కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. బోధన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని కమిషనర్ తెలిపారు. వర్షాకాలం కావడంతో పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పట్టణ ప్రగతిని పర్యవేక్షించిన వారిలో శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, కౌన్సిలర్ తూము శరత్‌రెడ్డి, నాయకుడు వల్లూరి చందు తదితరులు పాల్గొన్నారు.