బోధన్, మే 8: తెలంగాణ యూనివర్సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడంతో పాటు సైన్స్, టెక్నాలజీ రంగంలో ఎంతో మార్పును సాధించిందని తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ దాచేపల్లి రవీందర్ గుప్తా అన్నారు. బోధన్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన బోధన్ ఉషోదయ డిగ్రీ కళాశాల దశాబ్ది ఉత్సవాలను ఆయన జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేస్తుండడంతో పోటీ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఉషోదయ డిగ్రీ కళాశాల కోచింగ్‌ను ఇ వ్వాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఉషోదయ డిగ్రీ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు సెమిస్టర్ పరీక్షల్లో 10కి 10 జీపీఏ సాధించడం సంతోషకరమన్నారు. వీసీ రవీందర్ గుప్తాను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ వి.సూర్యప్రకాశ్, డైరెక్టర్లు దుష్యంత్, వెంకట రమణి, సునీత, ఉషోదయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శైలజ, జానియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ ఆనంద్‌రెడ్డి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.