విద్యానగర్/డిచ్పల్లి, జూన్ 8 : విద్యా ప్రమాణాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. బుధవారం ఆమె ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి సందర్శించారు. మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న కిచెన్షెడ్, డైనింగ్ హాల్ పనులను పరిశీలించి వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో శివాయిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల బడిబాట కరపత్రాలను ఆవిష్కరించారు.అంతకుముందు మాచారెడ్డి మండలం భవానీపేట పాఠశాలను సందర్శించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
పాఠశాలలో చేపడుతున్న పనులను పరిశీలించారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో వేర్వేరుగా ఎస్ఎంసీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్ అధికారులతో మన ఊరు -మన బడి కార్యక్రమంలో చేపడుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన ఊరు మన బడి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని అన్నారు.మొదటి విడుతలో 33 శాతం పాఠశాలలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ఆంగ్ల బోధన చేపడుతుందని, పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని పేర్కొన్నారు. ప్రతి మండలంలో రెండు పాఠశాలల్లో అభివృద్ధి పనులు ఈ నెల 12 లోగా వంద శాతం పూర్తి చేయాలన్నారు.
మన ఊరు -మన బడి/ ‘ మన బస్తీ -మన బడి’ కార్యక్రమం అమలులో నిజామాబాద్ జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.ప్రతి పాఠశాలలో తాగునీటి అవసరాల కోసం సంపును నిర్మిస్తూ, మిషన్ భగీరథ ద్వారా పైప్లైన్ కనెక్షన్ ఏర్పాటు చేస్తుండడంపై జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. మన ఊరు -మన బడికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో అమలుతీరును నిశితంగా పరిశీలన చేస్తున్నామని చెప్పారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు తన సర్వీసులో చూడలేదన్నారు.దీని ఔన్నత్యాన్ని గుర్తిస్తూ మన ఊరు -మన బడిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యాశాఖ, ఇంజినీరింగ్ విభాగం, పాఠశాల నిర్వహణ కమిటీలు సమన్వయంతో పనిచేస్తూ సత్ఫలితాలు సాధించాలని, ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలన్నారు. మన ఊరు -మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందని, ఆంగ్ల మాధ్యమ బోధనలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగనున్నదని ఎస్ఎంసీ చైర్మన్లు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. వారు ప్రస్తావించిన పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని వాకాటి కరుణ హామీ ఇచ్చారు. నిజామాబాద్ సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఈవో దుర్గాప్రసాద్, ఎంఈవోలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.