రెంజల్/ ఎడపల్లి/ మోర్తాడ్/ కమ్మర్పల్లి/ బాల్కొండ/ రుద్రూర్/ చందూర్, జూన్ 8: రెంజల్ మండలంలోని బాగేపల్లి, కూనేపల్లి గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో మెప్మా పీడీ రాములు పాల్గొన్నారు. ప్రభుత్వం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్న ఇంగ్లిష్ మీడియంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. బాగేపల్లి గ్రామ పంచాయతీ జీపీ బోర్డుపై అభివృద్ధి కార్యక్రమాల వివరాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించిన కార్యదర్శి రాజుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీడీవో శంకర్, ఎంపీపీ రజిని, సర్పంచులు సాయిలు, విజయా లింగం తదితరులు పాల్గొన్నారు.
ఎడపల్లిలో సర్పంచ్ ఆకుల మాధవీ శ్రీనివాస్, గ్రామ ప్రత్యేకాధికారి సిద్ధిరామేశ్వర్ ఆధ్వర్యంలో ప్రకృతి వనంలోని పిచ్చిమొక్కలను తొలగించి, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవాటిని నాటారు. మోర్తాడ్ మండలంలోని సుంకెల్లో పల్లెప్రగతి పనులను మండల ప్రత్యేకాధికారి నర్సింగ్‌దాస్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, కార్యదర్శి సాయిప్రసాద్ పరిశీలించారు. కమ్మర్పల్లి మండలంలో ఎంపీడీవో సంతోష్‌రెడ్డి, తహసీల్దార్ బావయ్య, మండల ప్రత్యేకాధికారి బాబూరావు తదితరులు పల్లెప్రగతి పనుల్లో పాల్గొన్నారు.
బాల్కొండ మండలంలోని నెహ్రూనగర్, ఎన్టీఆర్ కాలనీ, అంబేద్కర్‌నగర్ కాలనీల్లో సర్పంచ్ బూస సునీత, ఉప సర్పంచ్ షేక్ వాహబ్, మండల ప్రత్యేకాధికారి సత్యనారాయణ తదితరులు పల్లెప్రగతిలో భాగంగా పాదయాత్రను నిర్వహించారు.
రుద్రూర్ మండలం సులేమాన్‌నగర్, చందూర్ మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను ఎంపీడీవోలు బాలగంగాధర్, నీలావతి, చందూర్ మండల ప్రత్యేకాధికారి రమేశ్ బుధవారం పరిశీలించారు. పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. వారివెంట సులేమాన్ నగర్ సర్పంచ్ ఖాదర్, కార్యదర్శి మహ్మద్ ఖాజా, అంగన్వాడీ టీచర్లు, చందూర్ ఆర్ఐ నజీర్, కార్యదర్శి సాయిలు తదితరులు ఉన్నారు.