కామారెడ్డి, జూలై 29 : అడుగంటిన బావులు.. వట్టిపోయిన బోర్లతో.. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో గుక్కెడు తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడిచి పాతాళంలో ఉన్న నీటిని తోడుకొని తెచ్చుకునేవారు. వర్షాలు లేక చుక్క నీటికోసం భూములు బీడువారి నోళ్లు తెరిచేవి. ఒక్కో ప్రాంతంలో నేలతల్లిని క్షోభపెట్టి పాతాళానికి తవ్వినా నీటిజాడ కనిపించేందికాదు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాక.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జల సంరక్షణ పథకాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అడవుల సంరక్షణ, హరితహారం వంటి కార్యక్రమాలతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించడంతో జలకళను సంతరించుకున్నాయి. ఫలితంగా.. అందనంత లోతుకు పోయిన పాతళగంగమ్మ పైపైకి ఉబికి వస్తున్నది.
కామారెడ్డి జిల్లాలో ఆరేండ్ల రికార్డు స్థాయికి భూగర్భజలాలు వృద్ధి చెందాయి. ఈ నెలలో 94శాతం అధికంగా వర్షపాతం నమోదుకావడంతో భూగర్భజల నీటిమట్టం 7.2 మీటర్లకు చేరుకున్నది. జూలై నాటికి జిల్లా సాధారణ వర్షపాతం 389 మిల్లీమీటర్లు కాగా, ప్రస్తుతం 760 మిల్లీమీటర్లుగా నమోదైంది. దీంతో మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టుతోపాటు సింగీతం, కౌలాస్‌నాలా, పోచారం, కల్యాణి వంటి చిన్నతరహా ప్రాజెక్టులు, చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. ఏప్రిల్ నెలలో వానకాలం సీజన్ ప్రారంభంలో 12.91 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు.. మే నెలలో 12.81 మీటర్లు, జూన్‌లో 12.36 మీటర్లు, జూలై చివరి వారానికి 7.24 మీటర్లకు చేరుకున్నాయి.
13 మీటర్ల లోతు నుంచి 7 మీటర్లకు..
జిల్లాలో గతంలో ఎన్నడు లేనివిధంగా రికార్డు స్థాయిలో భూగర్భజలాలు పెరిగాయి. జూలై చివరి వారానికి 5.57 మీటర్ల మేర నీటిమట్టం పెరిగింది. గత ఆరేండ్లలో భూగర్భజలాలు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి అని భూగర్భజల శాఖ అధికారులు తెలిపారు. 2016 సెప్టెంబర్‌లో 13.01 మీటర్ల లోతులో ఉన్న జలాలు.. 2017లో 10.28 మీటర్లు, 2018లో 13.13మీటర్లు, 2019లో 12.24 మీటర్లుగా నమోదైంది. 2020లో 9.37 మీటర్లు, 2021 సెప్టెంబర్‌లో 6.84 మీటర్లు, నవంబర్‌లో 5.86 మీటర్ల వరకు భూగర్భ జలాలు ఉండేవి. ఈ ఏడాది జూన్ ప్రారంభంలో 12.36 మీటర్లుగా ఉన్న జలాలు.. నెలాఖరుకు 7.24 మీటర్లకు చేరింది. నెలరోజుల వ్యవధిలోనే 5.57 మీటర్ల మేర నీటిమట్టం పెరగడం గమనార్హం.
ఫీజో మీటర్లతో పక్కాగా.. వానలెక్క..
వర్షపాతం ఏ ప్రాంతంలో ఎంత ఉంది, భూగర్భ జలాల పరిస్థితి ఏంటి.. అనే వివరాలను తెలుసుకున్నప్పుడే భవిష్యత్తు అవసరాలను అంచనా వేయగలం. కరువు చాయలను కూడా ముందుగానే గుర్తించి స్పష్టమైన కార్యాచరణతో ప్రభుత్వాలు పరిష్కార మార్గాలను చూపగలవు. జిల్లాలో వర్షపాతం, భూగర్భ జలాల వివరాలను పక్కాగా తెలుసుకునేందుకు 68 ప్రాంతాల్లో ఫీజో మీటర్లను ఏర్పాటు చేశారు. వీటితో ప్రతినెలా భూగర్భ జలాలను అంచనా వేస్తున్నారు. 2021 నవంబర్‌కు ముందు జిల్లాలో 35 ఫీజో మీటర్లు ఉండేవి. వాటి సంఖ్యను ప్రస్తుతం 81కు పెంచగా, అందులో 68 ఫీజో మీటర్ల ద్వారా ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలను లెక్కిస్తున్నారు. మరో 13 మీటర్లలో సాంకేతిక లోపాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
జలసంరక్షణ, మిషన్ కాకతీయతో సత్ఫలితాలు..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం జలసంరక్షణకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా చెరువుల పునరుద్ధరణపై దృష్టి పెట్టింది. మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి సదాశివనగర్ చెరువుతోనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 1,106 చెరువులకు గాను రూ.392.33 కోట్లతో మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి పనులు చేపట్టారు. మరోవైపు భూగర్భజల సంరక్షణ కోసం కందకాలు, చెక్ డ్యాములు, ఫాంపాండ్స్ నిర్మించారు. మూడేండ్లుగా ఉపాధిహమీ పథకం కింద చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు చేపట్టారు. వీటితోపాటు ప్రభుత్వం ఏడేండ్లుగా చేపడుతున్న జల సంరక్షణ పథకాలతో జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో మరో రెండేండ్ల వరకు తాగు, సాగునీటికి ఇబ్బందులు లేనట్లే. హరితహారం పథకం కింద 2021-22 ఏడాదికి గాను 47.28 లక్షల మొక్కలు నాటి కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిచింది.
రికార్డు స్థాయి వర్షాలతో భూగర్భజలాలు పెరిగాయి..
గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో రికార్డుస్థాయిలో వర్షాలు కురుస్తుండడంతో భూగర్భజలాలు వృద్ధి చెందుతున్నాయి. గతేడాదితో పోలిస్తే 2 మీటర్ల మేర, ఇటీవల కురిసిన వర్షాలకు నెలరోజుల్లోనే 5.57 మీటర్ల నీటిమట్టం పెరిగింది. ఆరేండ్లలో భూగర్భజలాలు రెట్టింపు అయ్యాయి. మరో మూడు నెలలపాటు వానలు కురిసే అవకాశం ఉండడంతో మరింత పెరుగుతాయి. భవిష్యత్తులో నీటి ఇబ్బందులు తలెత్తకుండా పొదుపుగా వాడుకోవాలి. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.
– సతీశ్‌యాదవ్, ఏడీ, భూగర్భజలశాఖ, కామారెడ్డి