తాడ్వాయి, ఫిబ్రవరి 27: మహానుభావుల స్ఫూర్తి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. అందుకు పలు సామాజిక, ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న శాస్త్రవేత పైడి ఎల్లారెడ్డి నిదర్శనమని పేర్కొన్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ అవార్డు గ్రహీత పైడి ఎల్లారెడ్డి ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించగా, కలెక్టర్, ఎస్పీ హాజరై ఆయనను సన్మానించారు. ముందుగా శబరిమాత ఆశ్రమానికి పైడి ఎల్లారెడ్డి అందజేసిన వాటర్ప్లాంట్తోపాటు స్పీడ్‌గన్‌ను వారు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. మారుమూల గ్రామమైన దేవాయిపల్లిలో పుట్టి జపాన్‌లో సైంటిస్టుగా పనిచేసిన పైడి ఎల్లారెడ్డిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనేక గ్రామాలు, పాఠశాలలు, సంఘ భవనాలు, ఆలయాలకు వాటర్ప్లాంట్లు, విరాళాలు అందించారని గుర్తుచేస్తూ ఆయన సేవలను కొనియాడారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను స్థానిక సర్పంచులు గుర్తించాలని వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా పైడి ఎల్లారెడ్డి.. స్పీడ్‌గన్ అందజేయడం అభినందనీయమని అన్నారు. పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. పుట్టిన గ్రామం, పెరిగిన మండలంలోని ప్రజలకు సేవలు అందజేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మండలంలోని ప్రైమరీ పాఠశాలలకు క్రీడా సామగ్రి, కామారెడ్డి డిగ్రీ కళాశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. అనంతరం తనకు విద్య నేర్పిన గురువులను సన్మానించారు. సర్పంచ్ సంజీవులు, సీడీసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, డీఎస్పీ శశాంక్‌రెడ్డి, ఐడీసీఎంఎస్ డైరెక్టర్ కపిల్‌రెడ్డి, శ్యామ్‌రావు, నర్సారెడ్డి, సంగారెడ్డి, సందీప్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, రాజ్దాసు పాల్గొన్నారు.