డిచ్పల్లి, మార్చి 2: అరవై ఏండ్లకుపైగా చరిత్ర కలిగిన విద్యాలయం.. డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. అటు ఆటలు, వైజ్ఞానిక పోటీలతోపాటు ఇటు సాంస్కృతిక కార్యక్రమాలతో విశేష గుర్తింపును సాధించి పలువురి మన్ననలను పొందుతున్నది. ఇటీవలి కాలంలో కలెక్టర్ నారాయణరెడ్డి ఈ పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సువిశాలమైన ఆటస్థలం, చుట్టూ ఏపుగా పెరిగిన హరితహారం మొక్కలు, ఆకర్షణీయంగా ఉన్న సరస్వతీ మాత విగ్రహం, మూడు వందలకుపైగా విద్యార్థులు ఇవన్నీ కలెక్టర్‌ను అమితంగా ఆకర్షించాయి. ఆయన ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాఠశాల ప్రహరీ నిర్మాణం, భవనానికి ఆకర్షణీయమైన రంగులు, విద్యార్థులు నడవడానికి వాకింగ్ ట్రాక్, తాగునీటి ట్యాంకు చుట్టూ గద్దె ఏర్పాటు వంటి పనులు శరవేగంగా పూర్తయ్యాయి.
మన ఊరు – మన బడి కార్యక్రమంద్వారా ఆశిస్తున్న అభివృద్ధి ఈ పాఠశాలలో 185 మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమం, 115 మంది తెలుగు మాధ్యమం చదువుతున్నారు. పది గదులు తరగతులకే అవసరం ఉండగా, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, కంప్యూటర్ ల్యాబ్, ప్రయోగశాల, గ్రంథాలయం, క్రీడలు తదితర వాటికి గదులు అవసరమున్నా కేవలం 12 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
పదేండ్ల క్రితం మూడు అదనపు తరగతి గదుల నిర్మాణం ప్రారంభించినా, అవి ఇప్పటి వరకూ పూర్తికాలేదు. ఎన్సీసీకి అనుమతి లభించినా గదుల కొరత కారణంగా వాపసు వెళ్లిపోయింది. గ్రంథాలయానికి ప్రత్యేక గది లేకపోవడంతో సుమారు 4వేల పుస్తకాలు నిరుపయోగంగా మారాయి. ఇక అటల్ టింకరింగ్ ల్యాబ్ కోసం రెండు గదులు అవసరమున్నాయి. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా సమస్యలన్నీ తీరి ప్రైవేటును తలదన్నేలా ఈ బడి తయారవుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బర్దీపూర్ గ్రామ సర్పంచుగా 15 ఏండ్లపాటు సేవలందించిన నర్సింహారెడ్డి.. ఈ పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. తన ఏడెకరాల సాగు భూమిని పాఠశాల కోసం దానం చేశారు. ఆయన జ్ఞాపకార్థం పాఠశాలకు నర్సింహారెడ్డి పేరు పెట్టాలని పూర్వ విద్యార్థులు అధికారులు, సీఎం కేసీఆర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఆయన విగ్రహాన్ని కూడా పాఠశాలలో స్థాపించాలని కోరుతున్నారు.
పాఠశాల మైదానంలో సుమారు వెయ్యి మొక్కలు పెంచుతున్నాం. ఉపాధ్యాయులమే మా గ్రాంటు నుంచి పైపులను కొనుగోలు చేసి చెట్లకు నీరందించి సంరక్షిస్తున్నాం. మా పాఠశాల ఉద్యానవనాన్ని తలపిస్తుంది. ఎన్జీసీ నిధులు కొంతవరకు సహకరిస్తున్నా ఇంత పెద్దమొత్తం లో చెట్లు పెంచడానికి అవి సరిపోవు. మరింత ప్రత్యేక దృష్టి పెడితే బాగుంటుంది.