నిజాంసాగర్, మే 19: దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ కూలీల నుంచి ఓనర్లు, సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తలుగా ఎదగాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆకాంక్షించారు. ఎందరో మేధావులతో చర్చించిన తర్వాత దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతిని కాంక్షిస్తూ దళిత బంధు పథకానికి సీఎంకేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో 97 మంది దళితబంధు లబ్ధిదారులకు జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్రాజుతో కలిసి గురువారం వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమో, ఓట్ల కోసమో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టలేదన్నారు.
సీఎం కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అరవై ఏండ్లుగా దళితులకోసం అనేక పథకాలు అమలైనప్పటికీ అత్యధిక మంది దళితులు అట్టడుగునే ఉన్నారని అన్నారు. ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా నేరుగా లబ్ధిదారులకే పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసే పథకం దేశంలోనే మరెక్కడా లేదని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఆలోచన ఎవరికీ రాలేదని, సీఎం కేసీఆర్‌కే వచ్చిందన్నారు. గడిచిన ఏడేండ్ల నుంచి ఆయన ప్రతి సమావేశంలో దళితుల గురించి తనతో చర్చించేవారని తెలిపారు. దళితబంధు పథకం ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు.
దళిత బంధు లబ్ధిదారుల కోసం రక్షణ నిధిని ఏర్పాటు చేశారని, అనివార్య కారణాలతో ఇబ్బందులు ఎదురైతే రక్షణ నిధి నుంచి ఆదు కునేలా ఈ పథకాన్ని రూపొందించారని వివరిం చారు. మండలంలో మొత్తం 1800 దళిత కుటుంబాలకు గాను, 1297 కుటుంబాలను అర్హులుగా గుర్తించామని తెలిపారు. ఇందులో 946 కుటుంబాలకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇప్పటికే యూనిట్లను అందించామన్నారు. మిగితా యూనిట్లను జూన్‌లో అందజేస్తామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికీ ఈ పథకాన్ని తప్పకుండా అందజేస్తామని, ఎవరూ అనుమానాలను పెట్టుకోవద్దని సూచించారు.
దళితుల ఆర్థికాభివృద్ధే సీఎం లక్ష్యం : జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు
ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు అన్నారు. ఏ రాష్ట్రం లో లేనటువంటి పథకాలు తెలంగాణలో ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. దళితులపాలిట దేవుడయ్యారని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, ఆర్డీవో రాజాగౌడ్, దళితబంధు కమిటీ మండల అధ్యక్షుడు విఠల్, వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, తహసీల్దార్ నారాయణ, ఎంపీడీవో పర్బన్న, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.