ఇందూరు, ఫిబ్రవరి 23 : జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి నిజామాబాద్‌కు పేరుప్రతిష్ఠలు తేవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నగరంలోని డీఎస్ఏ మైదానంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా స్థాయి స్పో ర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వేముల.. జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గెలిచిన వారు ఆ స్థానాన్ని నిలుపుకోవాలని, ఓడిన వారు గెలిచే వరకు పోరాడుతూ ఉండాలని, క్రమశిక్షణతో ప్రయత్నం చేస్తే విజయం సాధిస్తారన్నారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకునే శక్తిని క్రీడలతో నేర్చుకుంటారని, సమస్యలు వస్తే పోరాటం చేసి గెలుస్తారన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం నిర్మించాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 99 స్టేడియాలకు రూ.213 కోట్లు మంజూరు చేసిందన్నారు. అందులో 31 స్టేడియాలు పూర్తయ్యాయని, బాల్కొండ నియోజకవర్గంలో కమ్మర్పల్లి, వేల్పూర్ స్టేడియాలను ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 31 స్టేడియాలు పూర్తికాగా 33 స్టేడియాలు ప్రొగ్రెస్‌లో ఉన్నాయని, 35 స్టేడియాల పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు. దేశంలోనే ఏ రాష్ర్టాల్లో ఇన్ని స్టేడియాలు లేవని, సీఎం కేసీఆర్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. అథ్లెటిక్స్ కోసం మెదక్, వరంగల్, కరీంనగర్లో 300 మీటర్లలో ఇంటర్నేషనల్ లెవల్ స్టాండర్డ్‌తో మూడు సింథటిక్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నారని, ఇప్పటికే మెదక్‌లో పూర్తయిందని, మిగతా రెండు ప్రొగ్రెస్‌లో ఉన్నాయని, ప్రతి జిల్లాకు ఒక సింథటిక్ ట్రాక్ అథ్లెటిక్స్ కోసం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందన్నారు.
యువత కోసం క్రీడలతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న నెహ్రూ యువకేంద్ర ప్రతినిధులు బెల్లాల్ శైలిని అభినందించారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా మాట్లాడుతూ ఓటమి గెలుపునకు తొలిమెట్టు అని, ఓటమి చెందిన క్రీడాకారులు దిగులు చెందకుండా గెలిచేందుకు ప్రయత్నించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, కలెక్టర్ నారాయణరెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నగర మేయర్ నీతూకిరణ్, గ్రంథాలయ చైర్మన్ ఆరుట్ల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.