డిచ్పల్లి, ఫిబ్రవరి 10: మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుకొంటున్నదని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ర్టాల అభివృద్ధి కోసం పాటుపడాల్సిన బాధ్యతను విస్మరించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేడీగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ప్రధానమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని మంటగలిపారని ఆరోపించారు. గురువారం ఆయన నిజామాబాద్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మోదీ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఇప్పటి వరకు తన ఏడేండ్ల పదవీ కాలంలో ఏ ఒక్క రాష్ర్టానికి కూడా నయా పైసా కేటాయించలేదన్నారు. రాష్ర్టాల అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విభజన ప్రక్రియ చేపట్టినప్పుడు బీజేపీ ముఖ్య నాయకురాలు సుష్మాస్వరాజ్‌తోపాటు ఆ పార్టీ ఎంపీలు కూడా ఉన్నారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని తెలుసుకోకుండా రాష్ట్ర విభజనను పార్లమెంట్లో తలుపులు మూసి చేశారని మోదీ వ్యాఖ్యానించడం అవివేకమన్నారు.
1969 నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ప్రారంభమైందన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టారని, అన్ని వర్గాల ప్రజలు ఐక్య ఉద్యమం చేసిన ఫలితంగా నేడు ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నట్లు వివరించారు. ఈ వాస్తవాలను తెలుసుకోకుండా ఇటీవల రాజ్యసభలో ప్రధాని మోదీ రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అర్థరహితమన్నారు. దేశంలో ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన మోదీ అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తడంలేదన్నారు. రాష్ర్టాల అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరు జాడే కరువైందన్నారు. అభివృద్ధిని పక్కనబెట్టి మత విద్వేషాలను రెచ్చగొడుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి నయా పైసా రాకపోయినా సీఎం కేసీఆర్ తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల్లోనూ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తూ దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
లోక్‌సభ ఎన్నికల ముందు తనను గెలిపిస్తే ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు మంజూరు చేయిస్తానని ప్రగల్భాలు పలికిన ఎంపీ ధర్మపురి అర్వింద్ గెలిచి మూడేండ్లు గడుస్తున్నా ఎన్నికల హామీని మాత్రం నెరవేర్చలేని దద్దమ్మ అని బాజిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎంపీగా తన పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యతను విస్మరించి ఈ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్, వారి కుటుంబీకులను విమర్శించడమే పనిగా పెట్టుకోవడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఎంపీ హోదాను మరిచి మత విద్వేషాలను రెచ్చగొడుతూ యువతను పక్కదారి పట్టించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇకనుంచి సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తే గ్రామాల్లో ఎంపీని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకుంటారని హెచ్చరించారు. ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, టీఆర్ఎస్ డిచ్పల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఇందల్వాయి మాజీ సర్పంచ్ పాశం కుమార్ పాల్గొన్నారు.