ఖలీల్‌వాడి ఏప్రిల్ 26: రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితిని ఇందూరు జిల్లా అక్కున చేర్చుకుంది. మొదటి నుంచీ సంపూర్ణ మద్దతు పలికి కేసీఆర్‌కు బాసటగా నిలిచింది. 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ సంచలన విజయాలు నమోదు చేసింది. పార్టీ మద్దతుదారులు 450 మంది సర్పంచులుగా గెలుపొందారు. 270 ఎంపీటీసీ స్థానాలతో పాటు 19 జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకున్న టీఆర్ఎస్.. జెడ్పీపై గులాబీ జెండా ఎగురవేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందే ఉద్యమ పార్టీ జిల్లాలో రెండుసార్లు విజయదుందుభి మోగించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉమ్మడి జిల్లా ప్రజలు టీఆర్ఎస్ వెన్నంటి నడిచారు. 2014, 2018 ఎన్నికల్లోనూ ఘన విజయం కట్టబెట్టారు. దీంతో ఇందూరు గడ్డ టీఆర్ఎస్కు అడ్డా అన్న పేరు వచ్చింది.
కేసీఆర్ మార్గదర్శనంలో..
కేసీఆర్ మార్గదర్శనంలో 2001 నుంచే జిల్లాలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. స్వరాష్ట్ర కల నెరవేరే వరకూ గులాబీ జెండా నాయకత్వంలో సబ్బండ వర్ణాలు పోరాటంలో పాల్గొన్నాయి. నాడు తెలంగాణ సాధన కోసం పోరాడిన టీఆర్ఎస్ వెన్నంటి నడిచిన ప్రజలు.. ఇప్పుడు బంగారు తెలంగాణ సాధనలో కేసీఆర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
తొలి అమరుడి యాదిలో..
ఎడపల్లి మండలంలోని నెహ్రూనగర్ గ్రామంతో సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఉందని స్థానికులు చెబుతారు. మహబూబ్‌నగర్‌కు చెందిన పాలమూరి శంకరయ్య తొలి తెలంగాణ ఉద్యమంలో అమరుడయ్యారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డితో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన.. 1969 మేలో హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. శంకరయ్య కుటుంబం ఎడపల్లి మండలంలోని నెహ్రూనగర్ గ్రామంలో స్థిరపడింది. మలి విడత ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్.. జిల్లాకు వచ్చిన సందర్భంలో తరచూ నెహ్రూనగర్‌కు వచ్చి శంకరయ్య కుటుంబాన్ని పరామర్శించే వారు. 2002లో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాకు వచ్చిన కేసీఆర్, శంకరయ్య కుటుంబ సభ్యులతో కలిసి గులాబీ జెండాను ఎగురవేశారు. మరోమారు బాసర ట్రిపుల్ ఐటీ ఆందోళన కార్యక్రమాలకు వెళ్తూ శంకరయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే, బోధన్‌కు వచ్చిన రెండు పర్యాయాల్లోనూ వారి ఇంటికి వెళ్లారు. ‘మా తాత తెలంగాణ ఉద్యమంలో అమరుడైన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తించి మా ఇంటికి వచ్చి పరామర్శించడం మాకు దక్కిన గౌరవమని’ శంకరయ్య మనవడు పాలమూరి జ్యోతిరాజ్ తెలిపారు.