బోధన్, ఏప్రిల్ 21: రెండేండ్ల క్రితం కరోనా సంక్షోభంలో రద్దయిన బోధన్ – మహబూబ్‌నగర్ ప్యాసింజర్ రైలు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం కాచిగూడ నుంచి ప్రారంభమైంది. కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా సోమవారం రాత్రి 11.20 గంటలకు బోధన్ రైల్వే స్టేషన్‌కు నిర్దేశిత సమయానికి సుమారు గంట ఆలస్యంగా చేరుకున్నది. తిరిగి బోధన్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు మంగళవారం ఉదయం 5.20 గంటలకు మహబూబ్‌నగర్‌కు బయల్దేరింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించినట్లుగానే బోధన్ – మహబూబ్‌నగర్ ప్యాసింజర్ రైలు కూతపెట్టింది.
ఇకనుంచి ప్రతిరోజూ ఇవే సమయాల్లో రైలు నడువనున్నది. బోధన్‌కు వచ్చేటప్పుడు కాచిగూడ – బోధన్ రైలుగా, తిరిగి వెళ్లేటప్పుడు బోధన్-మహబూబ్‌నగర్ రైలుగా ఉంటుంది. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి,అదే రోజు రాత్రి 10.25 గంటలకు బోధన్‌కు చేరుకుంటుంది. బోధన్ నుంచి మర్నాడు ఉదయం 5.20 గంటలకు బయల్దేరి కామారెడ్డి, కాచిగూడ, షాద్‌నగర్ మీదుగా మధ్యాహ్నం 1.45 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది. గతంలో బోధన్ – మహబూబ్‌నగర్ ప్యాసింజర్ రైలు నంబర్ 57474గా ఉండగా, ప్రస్తుతం 07275 నంబర్‌గా మారింది.
ప్యాసింజర్ రైలు అయినప్పటికీ, ఎక్స్‌ప్రెస్ చార్జీని వసూలు చేయడం ప్రారంభించారు. వాస్తవానికి ప్రయాణ చార్జి రూ.45 ఉండగా, రూ.95కు పెంచారు. ప్యాసింజర్ రైలుకు ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలుచేయడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.