నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 11: జిల్లా కేంద్రంలోని ఓ కల్లుబట్టీని అడ్డాగా చేసుకొని గంజాయిని విక్రయిస్తుండగా, నిందితుడు విజయ్ అనే యువకుడు రెండు రోజుల క్రితం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌కు పట్టుబడిన విషయం తెలిసిందే. నిందితుడిని విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ఇందుకుసంబంధించి ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తనకు గంజాయి సరఫరా చేసే ముగ్గురు వ్యక్తులు సినీ ఫక్కీలో వచ్చి అందజేసి వెళ్తారని, వారు ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుంచి గంజాయి సరఫరా చేస్తారు అనే విషయాలు తెలియదని నిందితుడు తెలిపాడు. అధికారులు ఎన్నిసార్లు అడిగినా ‘ఎవరికీ తెలియకుండా రాత్రివేళ ఆటోలో ముగ్గురు వ్యక్తులు వచ్చి తనకు మాల్ ఇచ్చి వెళ్తారు’ అని సమాధానం ఇవ్వడంతో ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అసలు నిందితులు ఎవరనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇదే కేసులో పట్టుబడిన మరో నిందితుడు మోపాల్ మండలం బార్సి తండాకు చెందిన మోతీరామును విచారించగా.. తాను కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం యాచారం ఏరియా నుంచి గంజాయి తీసుకు వచ్చినట్లు వెల్లడించాడు. దీంతో వారు ఏ ప్రాంతానికి చెందిన వారు అనే కోణంలో ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.