బీర్కూర్, మార్చి 30 : ప్రపంచమంతా ఆసక్తిగా తిలకించే ఐపీఎల్ టోర్నీ ఇటీవలే ప్రారంభమైంది. టోర్నీ పూర్తయ్యే దాకా క్రికెట్ క్రీడాభిమానులకు ప్రతిరోజూ పండుగే. ఈ నేపథ్యంలో యువత బెట్టింగులకు పాల్పడుతూ పక్కదారి పడుతోంది. ఒక్కో మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి దాకా ప్రతి బాల్కూ యువకులు బెట్టింగ్ పెడుతూ చివరకు అప్పులపాలవుతున్నారు. ఈ విష సంస్కృతి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో చాలా మంది పేకాటకు బానిసలయ్యారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కావడంతో యువత దృష్టి బెట్టింగులపైకి మరలింది. ఆయా గ్రామ శివారుల్లో, మంజీరా నది పరీవాహక ప్రాంతాల్లో పేకాట స్థావరాలను ఏర్పాటుచేసుకోగా, ఇప్పుడు అవి బెట్టింగులకు శిబిరాలుగా మారాయి. పోలీసుల నిఘా కొరవడడంతో ఈ చట్టవ్యతిరేక కార్యకలాపాలతో యువత భవిష్యత్తు పూర్తి అంధకారంలోకి వెళ్తున్నది. యువత బెట్టింగుల జోలికి వెళ్లకుండా పోలీసులు అవగాహన కల్పించడంతోపాటు హెచ్చరించాలని ప్రజలు అంటున్నారు. కూలీనాలీ చేసుకునే తమ బతుకులు మరింత ఛిద్రం కాకుండా ఉన్నతాధికారులు దృష్టిసారించాలని కోరుతున్నారు.