బోధన్, మార్చి 4: యుద్ధ వాతావరణం కారణంగా స్వస్థలానికి తిరిగి రావడం ఓ వైపు సంతోషాన్ని.. మరోవైపు బాధను కలిగిస్తున్నదని స్వగ్రామం బోధన్‌కు వచ్చిన ఎంబీబీఎస్ విద్యార్థి ముప్పరాజు వినయ్ అన్నారు. శుక్రవారం తెల్లవారు జామున బోధన్ చేరుకున్న వినయ్ ఆయన నివాసంలో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో తాము ఉంటున్న ప్రాంతానికి బార్డర్ దగ్గరగా ఉండడంతో యుద్ధవాతావరణం కనిపించకపోయినా, రెండు రోజుల పాటు జెట్లు తమ ప్రాంతం మీదుగా వెళ్లడంతో కొంత ఆందోళన కలిగించిందన్నారు. అక్కడి ప్రభుత్వం తమను సురక్షితంగా ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. యుద్ధ వాతావరణంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో స్వస్థలాలకు వెళ్లేందుకు ఉస్గరోజ్ నేషనల్ యూనివర్సిటీ ప్రతినిధులు పూర్తి ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. తాము ఉన్న ప్రాంతం నుంచి 30కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులకు తమను అప్పగించేందుకు ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేశారన్నారు. 24గంటలపాటు ప్రయాణించిన అనంతరం ఈ నెల 2న ఇండియన్ ఎంబసీ అధికారులకు తమను అప్పగించారని తెలిపారు. అక్కడ తమను సురక్షితంగా ఉంచి, 3న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఢిల్లీకి పంపారని, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి తల్లిదండ్రులు నరేందర్, సంధ్యారాణిలతో కలిసి బోధన్ చేరుకున్నట్లు వినయ్ వివరించారు. యుద్ధవాతావరణం కారణంగా.. అక్కడి ప్రజలు వారిలో ధైర్యాన్ని నింపుకొని.. మీరు తిరిగి ఇక్కడికే రావాలంటూ సాగనంపడం బాధగా అనిపించిందన్నారు. ఉక్రెయిన్ నుంచి తమను సురక్షితంగా చేర్చేందుకు చర్యలు చేపట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపాడు.
క్షేమంగా ఇంటికి..ఉక్రెయిన్ నుంచి స్వగ్రామానికి చేరుకుంటున్న విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లిన ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు ఒక్కొక్కరుగా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. పిల్లలు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో తల్లిద్ంరడ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి మనోగతాన్ని పంచుకున్నారు.
-నిజాముద్దీన్ తల్లి రజియా
ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న తన కుమారుడు నిజాముద్దీన్ రెండు రోజుల్లో ఇండియాకు వచ్చే అవకాశాలున్నాయని తల్లి రజియా ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. కరోనా సమయంలో నా కొడుకు నెల్లూరులో ఉంటే తానే స్వయంగా మోటార్ సైకిల్‌పై వెళ్లి తీసుకువచ్చానని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ దేశంలో ఉన్న నా కొడుకు రెండు రోజుల్లో స్వదేశానికి చేరుకుంటాడని కళాశాల నుంచి తనకు మెయిల్ అందిందని ఆమె వివరించారు.
ఇందూరు, మార్చి 4 : ఉక్రెయిన్ దేశంలోని కీవ్ క్యాపిటల్‌లో ఉన్న బోగొమొలెట్స్ జాతీయ వైద్య విశ్వవిద్యాలయంలో వైద్య విద్యనభ్యసిస్తున్న నగరానికి చెందిన చైతాళి శుక్రవారం ఇంటికి చేరుకున్నది. ఈ సందర్భంగా చైతాళి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 28న ట్రైన్లో కోవెల్ స్టేషన్‌కు, అక్కడున్న వలంటీర్ల సహాయంతో పోలాండ్ బార్డర్‌కి చేరుకున్నామన్నారు. ఇండియన్ ఎంబసీ సహాయంతో ప్రత్యేక విమానంలో గురువారం ఢిల్లీ చేరుకొని అక్కడి నుంచి మరో విమానంలో హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో దిగే వరకు తల్లిదండ్రులను చూస్తానని అనుకోలేదని, బార్డర్ చేరే వరకు లొకేషన్ ఆఫ్ చేసి ఉంచాలని చెప్పడంతో ఫోన్లో మాట్లాడే అవకాశం లేకుండా పోయిందన్నారు. బార్డర్‌కు చేరుకున్నాక ఒకసారి ఫోన్ ఆన్ చేసి క్షేమంగా ఉన్నానని తెలిపానని, అక్కడే ఉండి ఉంటే బతికి ఉండే వాళ్లం కాదని, తామున్న ప్రదేశమంతా ఇప్పుడు దారుణంగా మారిందని వివరించింది.
నస్రుల్లాబాద్, మార్చి 4: నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన సచిన్ గౌడ్ ఉక్రెయిన్ నుంచి శుక్రవారం క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లిన కొడుకు ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి వారం రోజుల పాటు ప్రయాణించి పోలాండ్ చేరుకొని, అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చినట్లు సచిన్ గౌడ్ తెలిపారు.
ఫిబ్రవరి 28న కాల్ చేసి ట్రైన్లో వెళ్తున్నానని చెప్పింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో చాలా కంగారు పడ్డాను. అసలు బతికుందా లేదా అని టెన్షన్ పడ్డాం. బార్డర్‌కు చేరుకున్నాక కాల్ రావడంతో ఊపిరి పీల్చుకున్నాం.
– డాక్టర్ సర్వడే సతీశ్ (చైతాళి తండ్రి)