వేల్పూర్,మార్చి 4: రాష్ట్రంలో అభివృద్ధి కండ్లముందే కనిపిస్తున్నా బీజేపీ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసిం గ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్‌లోని తన నివాసంలో మంత్రి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పల్లెలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తున్నాయన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సహకారంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అన్ని గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల కోసం 15 రోజుల్లోనే ప్రభుత్వం రూ.24.5 కోట్లు మంజూరు చేసిందన్నారు. కొత్తగా ఏర్పాటైన 18 జీపీ భవనాలకు రూ.3.60 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. బాల్కొండ మండలానికి రూ.2. 65 కోట్లు, ముప్కాల్ రూ. కోటీ 55 లక్షలు, మెండోరా రూ. కోటీ 80 లక్షలు, వేల్పూర్ రూ.6.10 కోట్లు, భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధి కాకుండా రూ. 2.85 కోట్లు, కమ్మర్పల్లి రూ.3.65 కోట్లు, మోర్తాడ్ రూ.కోటీ 95లక్షలు, ఏర్గట్ల రూ.కోటీ 45 లక్షలు, మానాల గ్రామంతో పాటు ఎనిమిది కొత్త పంచాయతీలకు రూ.కోటీ 5 లక్షలు మంజూరైనట్లు మంత్రి వివరించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పనులు త్వరగా పూర్తి చేయిస్తామన్నారు. ఇటీవల మూడు రోజుల పర్యటనలో రూ.100కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో బీటీ రోడ్లు, ఇరిగేషన్ పనులు, మోతె, వేల్పూర్, పడగల్ గ్రామాల్లో బ్రిడ్జిల నిర్మాణ పనులు ఉన్నాయని మంత్రి వివరించారు. అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉన్నదని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే చెబుతున్నా.. ఇక్కడి బీజేపీ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్‌కు ముందు, కేసీఆర్ వచ్చిన తరువాత అభివృద్ధి ఎలా ఉందో ప్రజలు, రైతులు ఆలోచించాలని కోరారు. అడిగిన వెంట నే నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సమావేశంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్‌రెడ్డి, డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, జడ్పీటీసీ అల్లకొండ భారతి, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, రేగుల్ల రాములు, నాగధర్, రాజాగౌడ్, రాజ్‌కుమార్, రాజేశ్వర్, కేతన్ తదితరులు పాల్గొన్నారు.