ఎల్లారెడ్డి, మార్చి 4 : మంజూరైన బిల్లులను చెల్లించే విషయమై లంచం తీసుకుంటూ ఎల్లారెడ్డి ట్రాన్స్‌కో డీఈఈ భద్రయ్య ఏసీబీ అధికారులకు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కామారెడ్డికి చెందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ సాయి ప్రకాశ్‌కు మూడు లక్షల రూపాయల బిల్లు మంజూరయ్యింది. ఇందుకు సంబంధించి డీఈఈ భద్రయ్య కాంట్రాక్టర్‌ను రూ.20వేలు లంచం అడిగాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని సాయిప్రకాశ్ తమకు ఫిర్యాదు చేశారని ఆయన వివరించారు. తమను కలిసిన తరువాత సాయిప్రకాశ్ మరోమారు డీఈఈ భద్రయ్యను కలిసి బతిమిలాడగా రూ.18 వేలు తీసుకునేందుకు ఒప్పుకున్నాడు. సాయి ప్రకాశ్ సమాచారం మేరకు తాము మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో డీఈఈ భద్రయ్య అద్దెకు ఉండే ఇంటికి వెళ్లి లంచం ఇవ్వగానే దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నామని, పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని డీఎస్పీ ఆనంద్ కుమార్ వివరించారు. ఆయన వెంట మరో ఇద్దరు సీఐలు శ్రీనివాస్, నగేశ్ ఉన్నారు.