ఖలీల్‌వాడి, మార్చి 4: కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల సేవలు మరువలేనివని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని న్యూఅంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన సొంత ఖర్చుతో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించారన్నారు. వారికి చేతులెత్తి మొక్కుతున్నామన్నారు. లాక్డౌన్లో నిస్సహాయులకు భోజనం అందజేసినట్లు చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన ప్రకారం మహిళా దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా రెడ్‌క్రాస్‌లో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా శుక్రవారం ప్రారంభించారు.