ఉమ్మడి జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు బుధవారం కూడా కొనసాగాయి. శివనామస్మరణతో జాగరణ చేసిన భక్తులు ఉపవాసదీక్షల్ని విరమించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో అన్నదానం చేపట్టారు. దీపోత్సవాలు, అగ్నిగుండాలు, అన్నపూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో శైవక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాల వద్ద బుధవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అర్ధరాత్రి లింగోద్భవ పూజలు నిర్వహించగా.. జాగరణ సందర్భంగా పలుచోట్ల సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఉదయం భక్తులు ఉపవాసదీక్షలు విరమించారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. శివరాత్రి జాతరను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద కొనుగోలుదారుల సందడి నెలకొన్నది. ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల కుస్తీ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.