తెలంగాణ పల్లెలు తల్లిలాంటివి.. బతుకుదెరువు కోసం ఎక్కడి నుంచి ఎవరొచ్చినా ఆదరించి అక్కున చేర్చుకుంటాయి. ఈ కోవలోనే ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్ నుంచి ఉపాధి కోసం మన జిల్లాకు వచ్చిన పలు కుటుంబాలకు ఉపాధి చూపుతున్నాయి.
బిచ్కుంద/ చందూర్, జనవరి 5: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. సాగుకు సిద్ధమైన రైతులు పనిముట్ల మరమ్మతులు చేపడుతున్నారు. అవసరమైన వారు కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన పలు కుటుంబాలు వ్యవసాయ పనిముట్ల మరమ్మతులు చేపడుతూ ఉపాధి పొందుతున్నాయి. రైతుల పంట పొలాలకు అవసరమయ్యే కత్తులు, కొడవళ్లు, గొడ్డళ్లను వీరు ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం వానకాలం, యాసంగి పంటలకు అవసరమయ్యే వ్యవసాయ పనిముట్లను వీరు మరమ్మతు, తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు.
మన ప్రాంత రైతులు సైతం వీరి వద్దే వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేస్తుంటారు. దీంతో నిత్యం రూ. రెండు వేల వరకు సంపాదిస్తున్నట్లు రాజస్థానీలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని బిచ్కుంద, చందూర్, ఇతర ప్రాంతాల్లోని చౌరస్తాల వద్ద రాజస్థానీలు తయారు చేసిన వ్యవసాయ పనిముట్లను విక్రయిస్తున్నారు. మొత్తానికి రాజస్థానీలు తయారు చేసే పనిముట్లంటే రైతులు ఫిదా అవుతున్నారనే చెప్పాలి. అయితే, ఈ కుటుంబాల్లోని చిన్నారులు కూడా పెద్దవారితోపాటే పనుల్లో నిమగ్నమవ్వడంతో చదువుకు నోచుకోకపోవడం బాధ కలిగించే అంశం.
రోజుకు 2వేలు సంపాదిస్తున్నాం..
ప్రతి సంవత్సరం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తుంటాం. వ్యవసాయ పనిముట్లను తయారు చేస్తూ విక్రయిస్తాం. మా వద్దే రైతులు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేస్తుండడంతో రోజుకు సుమారు రూ. 2 వేలు సంపాదిస్తున్నాం. సంతోషంగా ఉంది. మా రాష్ట్రం లో ఉపాధి లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ప్రజలు, రైతులు మమ్మల్ని ఆదరిస్తున్నారు. తెలంగాణ సంక్షే మ పథకాలు చూస్తుంటే మేము కూడా తెలంగాణలో పుడితే ఎంత బాగుండు అనిపిస్తున్నది.
– రమేశ్, రాజస్థాన్