- బీజేపీ విమర్శలపై టీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
బోధన్, జూలై 22: బీజేపీ ప్రభుత్వాలకు దమ్ములేకనే డబుల్ ఇంజిన్ కావాలంటూ ప్రచారం చేసుకుంటున్నారని టీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేశారు. తెలంగాణలో దమ్మున్న టీఆర్ఎస్ సర్కారు ఉన్నదని, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోధన్ ఏఎంసీ చైర్మన్ వీఆర్ దేశాయ్‌తోపాటు పలువురు నాయకులు మాట్లాడుతూ బీజేపీ విమర్శలను తిప్పికొట్టారు.
ఇప్పటికే వివాదాస్పద నాయకుడిగా పేరున్న రాజాసింగ్.. బోధన్‌లో పర్యటిస్తూ వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేసి ఇక్కడ కూడా వివాదాలు సృష్టించేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ పాలకులు జీఎస్టీ పేరిట పేదలను దోచుకుంటున్నారని మండి పడ్డారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ వంటి పథకాలను ఎందుకు అమలు చేయడంలేదంటూ ప్రశ్నించారు. బోధన్ ఎమ్మెలే షకీల్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో రైతుబంధు సమితి మండల మాజీ అధ్యక్షుడు బుద్దె రాజేశ్వర్, టీఆర్ఎస్ బోధన్ మండల అధ్యక్షుడు గోగినేని నరేంద్రబాబు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వెంకట్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ శరత్, సర్పంచులు చింతం నాగయ్య, శ్యాంరావు, నాయకుడు వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.