Nizamabad CP Sai Chaitanya | వినాయక నగర్, మార్చి 3 : విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ కాపర్ కాయిల్స్ టార్గెట్ గా చేసుకొని వర్ష చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు. గతంలో రోడ్ల పై ఉండే ఆవులను, వాహనాలను దొంగిలించి జైలుకు వెళ్లిన పాత నేరస్తులు జైల్లో తమకు పరిచయమైన ఇతర నిందితులతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని నిజామాబాద్,నిర్మల్ జిల్లాలలో వరుసగా ట్రాన్స్ఫార్మర్స్ కాపర్ వైర్లను దొంగిలిస్తూ పోలీసులకు చిక్కకుండా పరాల్లో ఉన్న ముఠాను పట్టుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.
ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని కమిషనరేట్లో గల కమాండ్ కంట్రోల్ హాల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ అంతరాష్ట్ర ముఠా సభ్యుల వివరాలను వెల్లడించారు. ఈ ముఠాకు చెందిన పలువురు దొంగిలించిన బైక్ పై తిరుగుతూ రాగి వైర్లు ఉండే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగటిపూట రెక్కి నిర్వహించే వారిని తెలిపారు. రాత్రి సమయంలో వచ్చి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్లను దొంగిలించుకుపోయేవారు అని సీపీ పేర్కొన్నారు.
నిర్మల్, జిల్లాతో బైంసా, బాసర, కుంటాల, నర్సాపూర్ తో పాటు నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్, నవీపేట్, బోధన్ రూరల్, ఎడపల్లి, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో వరుసగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తూ అందులోని రాగి తీగలను దొంగిలించి వాటిని విక్రయిస్తూ అక్రమ డబ్బులు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ ముఠాను పట్టుకునేందుకు నిజామాబాద్ జిల్లా పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. అందుకోసం నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్ పర్యవేక్షణలో నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నవీపేట్ ఎస్సై శ్రీకాంత్, మాక్లూర్ ఎస్సైలు యాదగిరి గౌడ్, రాజశేఖర్, నిజామాబాద్ ఐదవ టౌన్ ఎస్సై గంగాధర్ తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పరారీలో ఉన్న ఈ అంతర్ రాష్ట్ర ముఠాలు పట్టుకున్నట్లు సీపీ పేర్కొన్నారు.
ఈ ముఠాకు చెందిన అఫ్జల్ ఖాన్, అర్బాజ్ ఖాన్, అన్సార్, షేక్ తాహెర్, సిద్ధిక్ ఖాన్, మమ్మద్ అప్సర్, మహేబూబ్ ఖాన్, షేక్ ఆరిఫ్, మహమ్మద్ రాజా, బోర్గే బాలాజీ అను 10 మంది ముఠా సభ్యులను గుర్తించినట్లు తెలిపారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న ఏడుగురిని ప్రస్తుతం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా ఆన్సర్, షేక్ తాహెర్, సిద్ధిక్ ఖాన్ అను ముగ్గురు నిందితులు పరాయిల్లో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన ఏడుగురు నేరస్తుల వద్ద నుండి 1.20 క్వింటాళ్ల కాపర్ కాయిల్స్, రూ.2 లక్షల 75 వేల నగదు, రెండు దొంగిలించిన ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో రిక్షా తో పాటు చోరీలకు వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.
ఈ ముఠాను పట్టుకునేందుకు కృషిచేసిన సిబ్బంది ఏఎస్ఐలు గఫార్, హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, కానిస్టేబుళ్లు రాజారెడ్డి, సందీప్ ,అబ్బులు, శ్రీకాంత్ గౌడ్, దత్తాత్రేగౌడ్, నాగరాజు, శంకర్, సాయిలు, రామకృష్ణ, సచిన్ ను ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య అభినందించి, వారికి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో ఏసీపీ ప్రకాష్ యాదవ్, సీఐ శ్రీనివాస్ ఎస్ఐలు శ్రీకాంత్ యాదగిరి, గంగాధర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.