నిజామాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీలో బడుగు, బలహీన వర్గాల నేతలకు సరైన చోటు దక్కడం లేదన్న చర్చ నడుస్తోంది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలతో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. కష్టపడే వారికి గుర్తింపు రావడం లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జెండా మోసే వారిని కేవలం స్థానిక సంస్థల వరకే పరిమితం చేస్తున్నారన్న ఆవేదన ప్రతి ఒక్కరిలోనూ వెలుగు చూస్తోంది. అవకాశాల కోసం అర్రులు చాచుతున్నప్పటికీ పైరవీలు చేసుకునే వారికి మాత్రమే పెద్ద పీట దక్కుతుండటంపైనా ఆగ్రహావేశాలు రగులుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో జుక్కల్ మినహా అన్ని చోట్ల అగ్రవర్ణాలకే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చి నిలబెట్టింది. నిజామాబాద్ అర్బన్ ఒక్కటే మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ పోటీ చేశారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అన్ని చోట్ల ఇదే దుస్థితి కనిపించింది. తిరిగి పార్లమెంట్ పోరులో ఎంపీ అభ్యర్థిగా టి.జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో అంతా భగ్గుమన్నారు. పదవుల ఆశ చూపి చాలా మందిని చల్లబర్చినప్పటికీ ఏడాదిన్నర కాలంలో పదవుల పందెరం పూర్తి స్థాయిలో జరగలేదు. దీంతో హస్తం పార్టీలో ఆశావాహులు ఓ వైపు పార్టీ పదవుల్లో చోటు లేక, ప్రభుత్వంలో ప్రాధాన్యత లేక రగిలిపోతున్నారు.
డీసీసీ అధ్యక్షుల ఎంపికకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే ఫలితాలు గీటురాయిగా మారనుందని తెలుస్తోంది. రేపు, మాపు అంటూ డీసీసీ అధ్యక్ష రేసులో ఉన్న వారిని సముదాయిస్తూ వస్తోన్న అగ్ర నేతలంతా స్థానిక పోరు తర్వాతే భర్తీ చేపట్టబోతున్నట్లుగా చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయావకాశాల కోసం పాటుపడే వ్యక్తులకు గుర్తింపు ఇస్తామంటూ చెబుతుండటంతో చాలా మంది నిట్టూరుస్తున్నారు.
20 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజల నుంచి అంతగా పాజిటివ్ మద్ధతు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లినా ఏ వర్గాన్ని కదిలించినా నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాలతో ఆశావాహులు కంగుతింటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా పని చేయాలనుకునే ఆశలపై అధిష్టానం ఏదో ఒక రూపంలో నీళ్లు చల్లుతుందంటూ చాలా మంది నేతలు నిట్టూరుస్తున్నారు. లోకల్ బాడీలో రైతులు, మహిళలతో పాటుగా యువత తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా ఉండటంతో ఆ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే వీలు లేకుండా పోయింది.
దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆశించిన ఫలితాలను రాబట్టడం కష్టమనే అభిప్రాయంతో అనేకులు ఉండి పోయారు. పదవులు వస్తే రాని లేకుంటే లేదన్నట్లుగా మిన్నకుండి పోతున్నట్లుగా తెలుస్తోంది. మూడు నెలల్లోపు లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అందుకు తీవ్రంగా సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ ఊపు మీద ఉండగా అధికార కాంగ్రెస్ డీలా పడిపోయింది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు అధ్యక్ష స్థానాలను చేజిక్కించుకునేందుకు బీసీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో పదవులు తమకే ఇవ్వాలంటూ పలువురు నేతలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. కామారెడ్డిలో వైశ్య సామాజిక వర్గం నుంచి కైలాస్ శ్రీనివాస్ పని చేస్తున్నారు. నిజామాబాద్‌కు మానాల మోహన్ రెడ్డి కొనసాగుతున్నారు. మానాల మోహన్ రెడ్డి ఓవైపు కార్పొరేషన్ పదవితో పాటుగా డీసీసీ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. వీరి స్థానంలో కొత్తగా ఎవరికి చోటు కల్పిస్తారు? అన్నది ఎటు తేలడం లేదు. గడుగు గంగాధర్ సుదీర్ఘ కాలం డీసీసీ ప్రెసిడెంట్‌గా పని చేసిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తిరిగి పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టలేదు.
ప్రభుత్వానికి ముందు వరకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పీసీసీ చీఫ్‌గా నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్‌కు ప్రాధాన్యత దక్కడంతో తమకు భవిష్యత్తు ఉంటుందని అంత ఊహించుకున్నారు. అందుకు భిన్నంగా పదవుల భర్తీలో నిరాశ, నిస్పృహ కనిపిస్తోంది. భారత రాష్ట్ర సమితిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యవర్గాల్లో సామాజిక కూర్పును పాటించేది. కచ్చితంగా కోటాను అమలు చేసి సామాజిక స్ఫూర్తిని కేసీఆర్ పాటించారు. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో అలాంటిదేమీ మచ్చుకు కనిపించకపోవడం విడ్డూరంగా మారింది.