Dharmapuri Arvind | కంటేశ్వర్ ఫిబ్రవరి 16 : ఎంపీ అరవింద్ స్థాయికి మించి మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. కులగణన విషయంలో బీజేపీ వైఖరి ఏంటో తెలపాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అరవింద్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడని తెలిపారు. జిల్లాకు అప్పుడప్పుడు వస్తూ ప్రభుత్వంపై మాట్లాడితే ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు. కులగణన చేయడం ద్వారా ఎవరి వాటా ఎంత అని తెలిస్తే తమ ఉనికికే ప్రమాదం అవుతుందని, ప్రతి ఒక్కరూ తమ వాటా అడుగుతారని అరవింద్ భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు.
బీసీ కుల గణన చేయాలా? వద్దా అనేది బండి సంజయ్, అరవింద్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలో మైనార్టీలు ఎలా ఉంటారని బీజేపీ ప్రశ్నిస్తుందని.. మరి మోదీ ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ కోటాలో మైనార్టీలు లేరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ అభ్యర్థి లేడని అరవింద్ మాట్లాడుతున్నాని.. ఇది అరవింద్‌కు బుద్ధిలేని తనానికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఉపాధ్యాయులకే వదిలేశామని చెప్పారు. బీజేపీ అనేది ఒక జుటా బద్మాష్ పార్టీ అని, బీసీలుగా ఉన్న బీజేపీ నాయకులు బీసీ కులగణనను వ్యతిరేకిస్తున్నారని అది వాళ్ల పిచ్చితనానికి నిదర్శనం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపి, జిల్లా NSUI అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు నరేందర్ గౌడ్, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావీద్ అక్రం, కార్పొరేటర్ గడుగు రోహిత్, యూత్ కాంగ్రెస్ నగర మాజీ అధ్యక్షులు ప్రీతం తదితరులు పాల్గొన్నారు.