ధర్పల్లి/ఇందల్వాయి, ఏప్రిల్ 8: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
దోచుకోవడానికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ, పింఛన్లు, రైతుబంధు పెంపు తదితర వాటిని డిసెంబర్ 9న అమలు చేస్తామని చెప్పినప్పటికీ నేటి వరకు అమలు చేయలేదన్నారు. పరిపాలన చేసే సత్తా లేక కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ప్రకృతి సైతం సహకరించడం లేదని అన్నారు. కేసీఆర్ ఉంటే సమృద్ధిగా, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాయన్నారు. కేసీఆర్ ఉంటే సంక్షేమం లేకుంటే క్షామం అన్న పరిస్థితి ప్రకృతే తెలియజేస్తుందన్నారు. ఎమ్మెల్యేగా రూరల్ ప్రాంత అభివృద్ధికి ఎంతో చేశానని బాజిరెడ్డి ఈ సందర్భంగా ఆయన చేసిన పలు అభివృద్ధి పనులను వివరించారు. తాను చేసిన శంకుస్థాపనలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మళ్లీ శిలాఫలకాలు వేసి ప్రారంభించడం సిగ్గుచేటన్నారు.
అవసరమైతే పనులు పూర్తిచేసి ప్రారంభించుకోవాలన్నారు. ప్రస్తుత ఎంపీగా ఉన్న అర్వింద్ ఇప్పటి వరకు చేసిందేమీ లేకపోగా ఉచిత హామీలతో పబ్బం గడుపుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజలను నిండా ముంచిన పార్టీ అని, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి తీరా హామీలను నెరవేర్చలేక చేతులెత్తేస్తున్నదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఎంపీపీ నల్ల సారికా హన్మంత్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు, మండల కన్వీనర్ పీసు రాజ్పాల్రెడ్డి, మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, సొసైటీ చైర్మన్లు చెలిమెల చిన్నారెడ్డి, రాజేందర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.